తెలంగాణ
ములుగు సమీకృత జిల్లా కార్యాలయంలో మంత్రి సీతక్క సమీక్ష
31-10-2026 10:14

ములుగు జిల్లాలో పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని, జంగాలపల్లి గుట్టను దక్షిణాఫ్రికాలోని టేబుల్ మౌంటెన్ తరహాలో అభివృద్ధి చేసే అవకాశాలను పరిశీలిస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. ఈ ప్రాంతం నుంచి లక్నవరం, రామప్ప అందాలు కనిపించేలా వ్యూ పాయింట్ ఏర్పాటు చేసేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామన్నారు.
xPress24, Mulugu, October 31,
ములుగు జిల్లాలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని స్టేట్ చాంబర్లో మంత్రి సీతక్క సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ బోర్కాడే హేమంత్ సహదేవరావు, జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మీనా, అదనపు కలెక్టర్లు సహా జిల్లా ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. పర్యాటకం పై ప్రత్యేక దృష్టి, జిల్లా అభివృద్ధి సంబంధిత పలు అంశాలపై ఈ సమీక్షలో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ.. గత రెండు రోజులుగా ములుగు జిల్లాలో పర్యటిస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. కలెక్టరేట్‌లో జిల్లా అభివృద్ధిపై సమీక్ష నిర్వహించి, రాబోయే రోజుల్లో పాడి కొనుగోలు కేంద్రాలను త్వరగా ప్రారంభించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ములుగు జిల్లాలో పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని, జంగాలపల్లి గుట్టను దక్షిణాఫ్రికాలోని టేబుల్ మౌంటెన్ తరహాలో అభివృద్ధి చేసే అవకాశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. ఈ ప్రాంతం నుంచి లక్నవరం, రామప్ప అందాలు కనిపించేలా వ్యూ పాయింట్ ఏర్పాటు చేసేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామన్నారు. రామప్ప సరస్సులోని ఐలాండ్‌ను రూ.13 కోట్లతో అభివృద్ధి చేయడంతో పాటు, మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు కొత్త డిజైన్లు రూపొందిస్తున్నామని వెల్లడించారు. జిల్లాలోని చారిత్రక గుహలు, గుట్టలు, కోటలు, పురాతన ఆలయాలను పరిరక్షిస్తూ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. అటవీ అనుమతుల కారణంగా మారుమూల గ్రామాలకు నిలిచిపోయిన రహదారుల నిర్మాణానికి కలెక్టర్, డీఎఫ్‌ఓ, ఐటీడీఏ పీవో సమన్వయంతో డీఎల్‌సీ ద్వారా అనుమతులు పొందాలని సూచించినట్లు తెలిపారు.
దేశమే గ్రామాల్లో జీవిస్తుంది అనే విధంగా గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నామని, ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి గ్రామంలోనూ రూరల్ బిల్డింగ్‌లు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు వంటి అనేక అభివృద్ధి పనులు వేగంగా చేపడుతున్నామని, ప్రభుత్వంపై పడిన భారాన్ని లెక్కచేయకుండా, సీఎం డిప్యూటీ సీఎంల సహకారంతో భారీగా గ్రాంట్లు కేటాయించి ఉపాధి కల్పిస్తున్నామని, గ్రామాల్లో కూలీల సంఖ్యను పెంచి, ప్రతి ఒక్కరికీ ఉపాధి అవకాశాలు కల్పించడమే మా ప్రధాన లక్ష్యమని తప్పుడు ప్రచారాలను నమ్మకుండా, అభివృద్ధి దిశగా సాగుతున్న ప్రభుత్వానికి అందరూ సహకరించాలని మంత్రి సీతక్క కోరారు.
బైట్: సీతక్క, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి