తెలంగాణ
మహబూబాబాద్‌లో చేయూత పింఛన్ల పంపిణీ.. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ముందంజ: ఎంపీ బలరాం నాయక్
18-11-2026 10:10
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీ నాయక్ కలిసి లబ్ధిదారులకు కొత్త చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా లేవని ఎంపీ బలరాం నాయక్ అన్నారు. నియోజకవర్గంలో సుమారు నాలుగు వేల కొత్త పింఛన్లు అందిస్తున్నామని, ఈ నెల 19న లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ అవుతుందని ఎమ్మెల్యే మురళీ నాయక్ తెలిపారు.
xPress24, MAHABUBABAD, November 18,
తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోని మరే ఇతర రాష్ట్రంలోనూ అమలు కావడం లేదని మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఏబీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీ నాయక్‌తో కలిసి లబ్ధిదారులకు కొత్తగా మంజూరైన చేయూత పింఛన్ల పత్రాలను ఎంపీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ బలరాం నాయక్ మాట్లాడుతూ.. రాష్ట్రంపై అప్పుల భారం ఉన్నప్పటికీ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తున్నామని తెలిపారు. సన్నబియ్యం పంపిణీ, ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, కొత్త రేషన్ కార్డులు వంటి సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. యంగ్ ఇండియా పాఠశాలలు పేద విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నది ఎవరో ఓటర్లే నిర్ణయిస్తారని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ మెజారిటీతో విజయం సాధిస్తుందని చెప్పారు.
నియోజకవర్గంలో నాలుగు వేల కొత్త పింఛన్ల పంపిణీ: ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్
అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని అన్నారు. మహబూబాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు నాలుగు వేల కొత్త పింఛన్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 19వ తేదీన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పింఛన్ నగదు జమ అవుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పింఛన్ల లబ్ధిదారులు పాల్గొన్నారు.
బైట్స్
పోరిక బలరాం నాయక్, మహబూబాబాద్ ఎంపీ
డాక్టర్ భూక్య మురళీ నాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే