జాతీయం
యువతే ప్రభుత్వ విధానాలకు కేంద్ర బిందువు: ప్రధాని నరేంద్ర మోదీ
24-10-2026 09:51
దిల్లీలో జరిగిన ‘చిన్మయ అమృత్ మహోత్సవ్ గ్లోబల్ సమ్మేళనం’లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. యువత ఆధారంగానే ప్రభుత్వ విధానాల రూపకల్పన సాగుతోందని, జాతీయ విద్యా విధానం ద్వారా నూతన సాంకేతికతకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.
xPress24, Delhi, October 23,
యువతే ప్రభుత్వ విధానాలకు కేంద్ర బిందువు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రముఖ అంతర్జాతీయ ఆధ్యాత్మిక సంస్థ ‘చిన్మయ మిషన్’ 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన ‘చిన్మయ అమృత్ మహోత్సవ్ గ్లోబల్ సమ్మేళనం' ముగింపు వేడుకలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. గత 12 ఏళ్లలో విదేశాల నుంచి 650కి పైగా పురాతన విగ్రహాలు, కళాఖండాలను వెనక్కి తెచ్చామని వెల్లడించారు.
జాతీయ విద్యా విధానం అమలు
నూతన భారతదేశ అవసరాలకు తగ్గట్టుగా దేశ విద్యా వ్యవస్థను తీర్చిదిద్దడానికే జాతీయ విద్యా విధానాన్ని తీసుకువచ్చినట్లు మోదీ స్పష్టం చేశారు. మాతృభాషలో విద్య, ఆధునిక విజ్ఞానం, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతకు ఈ విధానంలో ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ సాధన కోసం అందరూ ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.