ఉద్యోగాలు
యువతకు స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు
23-09-2026 05:30
యువతకు స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు.
xPress24, Mumidivaram, September 22,
ముమ్మిడివరం:
యువతకు స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఉషాకిరణ్ ఐటీఐ ప్రాంగణంలోని ఎంజీఆర్ కాలేజీలో ‘యువత భవితకు భరోసా’ కార్యక్రమం నిర్వహించారు.
ప్రభుత్వ విప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి సుభాష్ మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో కొత్త పరిశ్రమలు రాష్ట్రానికి రాకపోగా, సుమారు 32 కంపెనీలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని విమర్శించారు. కియా సంస్థ విస్తరణకు కూడా అనుకూల పరిస్థితులు లేకపోవడంతో పెట్టుబడులు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయాయని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల నాలుగు నెలల కాలంలో రాష్ట్రానికి రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చామని మంత్రి తెలిపారు. పరిశ్రమల స్థాపన ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.