తెలంగాణ
రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్‌లో పిల్లల ప్రజావాణి
17-11-2026 10:26
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా పిల్లల ప్రజావాణి నిర్వహించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, కమిషన్ సభ్యురాలు మర్రిపల్లి చందన చిన్నారుల నుంచి 6 దరఖాస్తులను స్వీకరించి పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు.
xPress24, rajanna siricilla, November 16,
రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సముదాయంలో సోమవారం సాధారణ ప్రజావాణితో పాటు ప్రత్యేకంగా 'పిల్లల ప్రజావాణి' కార్యక్రమాన్ని నిర్వహించారు. బాలల దినోత్సవం, బాలల హక్కుల వారోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు మర్రిపల్లి చందన చిన్నారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, మౌలిక వసతులు, స్పాన్సర్‌షిప్ నిధులు, దివ్యాంగుల పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలు, కుటుంబ ఆస్తి వివాదాలకు సంబంధించిన సమస్యలను చిన్నారులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.
గంట వ్యవధిలోనే 6 ఫిర్యాదుల స్వీకరణ
కార్యక్రమం ప్రారంభమైన గంట వ్యవధిలోనే 6 ఫిర్యాదులు అందాయని కమిషన్ సభ్యురాలు మర్రిపల్లి చందన తెలిపారు. వీటిపై జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. ప్రతి ఫిర్యాదు పరిష్కార స్థితిని కమిషన్ నిరంతరం పర్యవేక్షిస్తుందని, జాప్యం జరిగితే అధికారులకు రిమైండర్లు పంపుతామని స్పష్టం చేశారు. బాలల హక్కులను కాపాడుతూ వారికి మెరుగైన భవిష్యత్తు అందించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమన్నారు. ప్రత్యేక బోర్డుపై "చిల్డ్రన్.. యూ ఆర్ ద ఫ్యూచర్.. ఫ్లై హై.. వీ ఆర్ విత్ యూ" అనే సందేశాన్ని కలెక్టర్ రాసి సంతకం చేశారు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ చైర్మన్ అంజయ్య, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, విద్యాధికారి విజయ్ సాగర్ పాల్గొన్నారు.
బైట్ - మర్రిపల్లి చందన, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు