ట్రావెల్
రాజమహేంద్రవరంలో సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు
26-09-2026 14:38
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను వినియోగించుకుని ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో సరికొత్త శకానికి నాంది పలుకుతున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.
xPress24, Rajahmundry, September 26,
రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 26: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను వినియోగించుకుని ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో సరికొత్త శకానికి నాంది పలుకుతున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 27న రాజమహేంద్రవరంలోని మంజీరా కన్వెన్షన్ హాల్‌లో రాష్ట్ర స్థాయి వేడుకలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
‘డిజిటల్ అజెండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు రీడిజైన్ టూరిజం’
అనే గ్లోబల్ థీమ్‌తో ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. పర్యాటక రంగ నిపుణులు, టూర్ ఆపరేటర్లు, హాస్పిటాలిటీ రంగ ప్రతినిధులు, కంటెంట్ క్రియేటర్లు, టెక్నాలజీ ఇన్నోవేటర్లు ఈ వేడుకల్లో పాల్గొననున్నారని చెప్పారు.
రాష్ట్రంలోని 130కిపైగా పర్యాటక ప్రాంతాల్లో ఏఐ ఆధారిత
‘నివు’ క్యూఆర్ కోడ్‌లను
అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి తెలిపారు. పర్యాటకులు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా 130కిపైగా భాషల్లో మాట్లాడగల డిజిటల్ గైడ్ ‘నివు’ ద్వారా ఆయా ప్రాంతాలకు సంబంధించిన సమాచారాన్ని నేరుగా పొందవచ్చని వివరించారు. పర్యాటక ప్రాంతాల చరిత్ర, ప్రత్యేకతలు, సందర్శకులకు అవసరమైన ఇతర సమాచారాన్ని సులభంగా తెలుసుకునే అవకాశం కలుగుతుందని చెప్పారు.
‘ది గోదావరి కాల్స్’
పేరుతో ప్రత్యేక పర్యాటక ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని చేపట్టనున్న ఈ కార్యక్రమం ద్వారా గోదావరి ప్రాంతంలోని సాంస్కృతిక, ఆధ్యాత్మిక, ప్రకృతి పర్యాటక విశేషాలను ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యమని తెలిపారు.
పర్యాటక రంగంలో ప్రతిభ కనబరిచిన వారికి
ఏపీ టూరిజం అవార్డ్స్-2026
అందించనున్నట్లు మంత్రి తెలిపారు. సోషల్ మీడియా, డిజిటల్ కంటెంట్‌కు ఉన్న ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక క్రియేటర్, ఇన్‌ఫ్లుయెన్సర్ కార్యక్రమాలను కూడా నిర్వహించనున్నట్లు చెప్పారు.
సెప్టెంబర్ 26న విశాఖపట్నం నుంచి రాజమహేంద్రవరానికి
హాప్-ఆన్ హాప్-ఆఫ్ డబుల్ డెక్కర్ బస్సులను
తీసుకురానున్నట్లు మంత్రి తెలిపారు. రెండు బృందాలుగా కంటెంట్ క్రియేటర్లు, ఫోటోగ్రాఫర్లు, స్టోరీటెల్లర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు గోదావరి ప్రాంతంలోని వివిధ పర్యాటక ప్రాంతాలను సందర్శించనున్నారని వెల్లడించారు.
ఏఐ, డిజిటల్ టెక్నాలజీని సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా రాష్ట్ర పర్యాటక రంగాన్ని మరింత ఆధునికంగా, సందర్శకులకు సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు.