తెలంగాణ
రేపటి నుంచి మూడు రోజుల పాటు కొడంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
07-11-2026 10:02
కొడంగల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి రేపటి నుంచి మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. రూ. 9,100 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టనున్నారు. ఇందులో రూ. 5,060 కోట్ల రేడియల్ రోడ్డు-2, లగచర్లలో రూ. 81 కోట్ల ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణాలు ఉన్నాయి. పర్యటన ముగింపు సందర్భంగా 50 వేల మందితో రైతు బహిరంగ సభ జరగనుంది.
xPress24, Hyderabad, November 6,
వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం నుంచి మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా రూ. 9,100 కోట్ల వ్యయంతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. తొలిరోజు హకీంపేట చేరుకుని రైతు మేళా, పారిశ్రామిక ఎగ్జిబిషన్‌ను ప్రారంభించనున్నారు. రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. అనంతరం లగచర్లలో రూ. 81 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఆయిల్ పామ్ కర్మాగార నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.
రూ. 5,060 కోట్లతో రేడియల్ రోడ్డు-2 పనులకు శంకుస్థాపన
రూ. 5,060 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న రేడియల్ రోడ్డు-2 పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. కొడంగల్, బొంరాస్‌పేట, దుద్యాల మండలాల పరిధిలో నూతనంగా నిర్మించిన పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, ఆసుపత్రులు, పోలీస్ స్టేషన్ల భవనాలను ప్రారంభించనున్నారు. పర్యటన చివరి రోజున 10 జిల్లాల నుంచి హాజరయ్యే 50 వేల మంది రైతులతో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది.