తెలంగాణ
రాష్ట్రంలో BJP అధికారంలోకి రాబోతోంది: ఎంపీ అర్వింద్
23-10-2026 09:45
తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తే పసుపునకు క్వింటాల్‌కు రూ.50 వేల ధర కల్పిస్తామని ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. క్రాప్ హాలిడే ప్రకటిస్తే ఎకరానికి రూ.50 వేల పరిహారం ఇవ్వాలని, ప్రాజెక్టుల నిర్మాణాలు, అభివృద్ధి పనులపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.
xPress24, Nizamabad, October 22,
తెలంగాణలో రైతులు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తే పసుపు ధర క్వింటాల్‌కు రూ.50 వేలకు చేరుతుందని స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా బిజెపి కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావంతో ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్న తరుణంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వానికి ముందుచూపు అవసరమని సూచించారు. పంటల సాగు సాధ్యం కాక క్రాప్ హాలిడే ప్రకటిస్తే రైతులకు ఎకరానికి రూ.50 వేల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ప్రాజెక్టుల నిర్మాణంలో లొసుగులు
కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో గత ప్రభుత్వం రూ.1 లక్ష కోట్ల అక్రమాలకు పాల్పడిందని ఎంపీ ఆరోపించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు బదులుగా కాళేశ్వరం నిర్మించడం వెనుక స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయని విమర్శించారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకుల తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఆ పార్టీలకు మద్దతు ఇస్తే భవిష్యత్తు దెబ్బతింటుందని తెలిపారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల మధ్య పొత్తు ఏర్పడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
అభివృద్ధి పనులపై నిర్లక్ష్యం
జిల్లాలో నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జిల పనులను పూర్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. సిజెపి ఆందోళనలకు విదేశాల నుంచి ఆర్థిక సహాయం అందుతోందని, పార్లమెంటరీ కమిటీలో ఈ అంశంపై చర్చ జరిగిందని వెల్లడించారు. భవిష్యత్తులో దీనిపై కఠిన చర్యలు ఉండే అవకాశం ఉందని చెప్పారు. రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.