తెలంగాణ
రాష్ట్రంలో నీటి ఎద్దని నివారణ చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
29-10-2026 09:45

ఎల్ నినో నేపథ్యంలో రాబోయే రోజుల్లో తాగు, సాగునీటికి తీవ్ర కొరత ఏర్పడే అవకాశమున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవడమే కాకుండా... ఉపయోగించిన నీటిని పునర్వినియోగించే కార్యచరణపైనా దృష్టిసారించింది.
xPress24, Hyd, October 28,
రాష్ట్రంలో నీటి ఎద్దని నివారణ చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. తాగునీటి వనరులపై ఒత్తిడిని తగ్గించేందుకు మురుగునీటి శుద్ధి ప్లాంట్ల ద్వారా వచ్చే ట్రీటెడ్ వాటర్ వినియోగాన్ని భారీగా పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో ఎస్టీపీలు, ట్రీటెడ్ వాటర్ వినియోగంపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో సీఎం కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. శుద్ధి చేసిన నీటి నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్న ముఖ్యమంత్రి.. సచివాలయం, సీఎం కార్యాలయం సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వంద శాతం ట్రీటెడ్ వాటర్‌నే వినియోగించాలని తేల్చిచెప్పారు.
పట్టణాల్లో పెరుగుతున్న నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని మురుగునీటి శుద్ధి ప్లాంట్లలో సరికొత్త విధానాలు తీసుకురావాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎస్టీపీల నిర్వహణలో కృత్రిమ మేధ సాంకేతికతను జోడించాలని, ప్రతి ప్లాంట్ వద్ద ప్రత్యేక పర్యవేక్షణాధికారిని నియమించాలని చెప్పారు. ప్లాంట్ల పనితీరును నిరంతరం పర్యవేక్షించే బాధ్యతను హైడ్రాకు అప్పగించాలని, విద్యుత్ వ్యయం తగ్గించేందుకు సౌరశక్తిని వినియోగించే మార్గాలను పరిశీలించాలని ఆదేశించారు. అలాగే ప్రైవేట్ రంగంలోనూ ఎస్టీపీల ఏర్పాటును ప్రోత్సహించాలని సూచించారు.
ప్రభుత్వ ప్రాంగణాలు, పార్కులు, ఓఆర్ఆర్ పరిధిలోని ల్యాండ్‌స్కేపింగ్, రోడ్ల శుభ్రతకు శుద్ధి చేసిన నీటినే వాడాలని సీఎం నిర్దేశించారు. రైల్వే, మెట్రో రైల్ విభాగాలతో పాటు నగరంలో శరవేగంగా విస్తరిస్తున్న డేటా సెంటర్లకు సైతం ట్రీటెడ్ వాటర్ అందించేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేసే దశలోనే ట్రీటెడ్ వాటర్ వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ కఠిన నిబంధనలు తీసుకురావాలని ఆదేశించారు. నీటి పంపిణీలో పారదర్శకత కోసం సరఫరా ట్యాంకర్లకు జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని... ప్రజలు, సంస్థల సౌలభ్యం కోసం ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తేవాలని సూచించారు. తాగునీటి సరఫరాకు ఎక్కడా లోటు రాకుండా ప్రత్యామ్నాయ అవసరాలన్నింటికీ ఈ శుద్ధి చేసిన నీటిని సమర్థంగా వినియోగించుకోవాలని స్పష్టం చేశారు.
పర్యావరణ హితంగా, భవిష్యత్ తాగునీటి సంక్షోభ నివారణే ధ్యేయంగా ప్రభుత్వం రూపొందించిన ఈ బృహత్ ప్రణాళికతో నగరంలో నీటి యాజమాన్య నిర్వహణలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఉన్నతాధికారులు మాణిక్ రాజ్, నికోలస్ తదితరులు పాల్గొన్నారు.