జాతీయం
వచ్చే 20 ఏళ్ల పెట్టుబడులకు 'ఇండియా ఫస్ట్' పునాది కావాలి: ఫిక్కీ శతాబ్ది సదస్సులో ప్రధాని మోదీ
20-11-2026 10:00
వచ్చే 20 ఏళ్లలో తీసుకునే ప్రతి దీర్ఘకాలిక పెట్టుబడి నిర్ణయానికి 'ఇండియా ఫస్ట్' నినాదాన్ని పునాదిగా చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పారిశ్రామిక రంగానికి పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన ఫిక్కీ శతాబ్ది సదస్సులో మాట్లాడిన ఆయన, గడిచిన 12-13 ఏళ్లలో 50 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపారు. దేశీయ మార్కెట్‌కే పరిమితం కాకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రపంచ మార్కెట్లలో పోటీ పడాలని పారిశ్రామికవేత్తలకు ప్రధాని సూచించారు.
xPress24, Delhi, November 19,
పారిశ్రామికవేత్తలు వచ్చే 20 ఏళ్లలో తీసుకునే ప్రతి దీర్ఘకాలిక పెట్టుబడి నిర్ణయానికి 'ఇండియా ఫస్ట్' నినాదాన్ని పునాదిగా చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. గురువారం న్యూఢిల్లీలో జరిగిన వాణిజ్య, పారిశ్రామిక మండలి 'ఫిక్కీ' (FICCI) శతాబ్ది సదస్సులో మోదీ ప్రసంగించారు. 100 ఏళ్ల ప్రస్థానంలో భారత పారిశ్రామిక రంగం సాధించిన ప్రగతికి ఫిక్కీ సాక్షిగా నిలిచిందని, రాబోయే 20 ఏళ్లలో ఏం సాధించాలో నిర్దేశించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. గతంలో లైసెన్స్ కోటా రాజ్, జాతీయీకరణ వైఫల్యాలు, 'ఫ్రాజైల్ ఫైవ్' ఆర్థిక వ్యవస్థల జాబితాలో భారత్ ఉన్న రోజులను ప్రజలు చూశారని గుర్తుచేశారు. అయితే గత 12 ఏళ్లలో యువత, రైతులు, కార్మికులు, పారిశ్రామికవేత్తల కృషితో పరిస్థితి మారిందని తెలిపారు. నేడు భారత్ దాదాపు 7 శాతం వృద్ధి రేటుతో ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని, గత నెలలో వస్తు ఎగుమతులు 50 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని వెల్లడించారు.
12 ఏళ్లలో 50 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు
ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక ప్రకారం.. కేవలం 12-13 ఏళ్లలోనే 50 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడ్డారని ప్రధాని మోదీ తెలిపారు. 1970లలో 'గరీబీ హటావో' నినాదం ఇచ్చినప్పుడు దేశ జనాభా 50 కోట్లుగా ఉండేదని, అప్పట్లో సరైన విధానాలు, చిత్తశుద్ధి లోపించడం వల్ల పేదరిక నిర్మూలన సాధ్యం కాలేదని విమర్శించారు. పారిశ్రామికవేత్తలు దేశీయ మార్కెట్‌కే పరిమితం కాకుండా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తులు తయారు చేసి ప్రపంచ మార్కెట్లలో పోటీ పడాలని సూచించారు. కార్పొరేట్ పన్నును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించడం, రూ. 12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వడం, జీఎస్టీ రేట్ల తగ్గింపు వంటి సంస్కరణల ద్వారా పన్ను చెల్లింపుదారులు, పారిశ్రామిక రంగానికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని వివరించారు. 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఫిక్కీ సభ్యులకు ప్రధాని అభినందనలు తెలిపారు.
బైట్స్
నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి