ఆంధ్రప్రదేశ్
విజయనగరం జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట పోలీసు బందోబస్తు
30-10-2026 16:54

విజయనగరం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పోలీసు యంత్రాంగం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టింది.
xPress24, Vizianagaram, October 30,
విజయనగరం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పోలీసు యంత్రాంగం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. నవంబరు 1న జరగనున్న విజయనగరం నగరపాలక సంస్థ, బొబ్బిలి మున్సిపాలిటీ, నెల్లిమర్ల నగర పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించడంతోపాటు, ప్రతి ఒక్కరూ స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా సుమారు 1,500 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని బందోబస్తు విధుల్లో నియమించినట్లు జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ తెలిపారు.
ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా విజయనగరం, బొబ్బిలి, నెల్లిమర్ల ప్రాంతాలకు ఒక్కొక్క డీఎస్పీని బాధ్యులుగా నియమించామని, వారి విధులను పర్యవేక్షించేందుకు అదనపు ఎస్పీ స్థాయి అధికారులను నియమించినట్లు వివరించారు.
ఎన్నికల బందోబస్తు కోసం నలుగురు డీఎస్పీలు, 8 మంది సీఐలు, 47 మంది ఎస్‌ఐలు, 84 మంది ఏఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, 302 మంది కానిస్టేబుళ్లు, 140 మంది హోంగార్డులతోపాటు ఆర్మ్డ్ రిజర్వ్, ఇతర విభాగాలకు చెందిన పోలీసు సిబ్బందిని డిప్యూటేషన్‌పై వినియోగిస్తున్నట్లు తెలిపారు.
పోలింగ్ కేంద్రాల గత చరిత్ర, ఆయా ప్రాంతాల్లో నమోదైన కేసులు, ప్రస్తుత పరిస్థితులను సమగ్రంగా పరిశీలించి హైపర్ సెన్సిటివ్, సెన్సిటివ్, నార్మల్ కేంద్రాలుగా వర్గీకరించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఈ వర్గీకరణకు అనుగుణంగా పోలీసు సిబ్బందిని కేటాయించి భద్రతా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
ఎన్నికల అనంతరం కూడా ఎలాంటి గొడవలు, ఘర్షణలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి పోలీసు పికెట్లు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.