తెలంగాణ
వారణాసి, ప్రయాగ్‌రాజ్ లో భక్తజన సందోహం
24-11-2026 16:36

కార్తీక పౌర్ణమి, దేవ దీపావళి, గురు నానక్ జయంతి పర్వదినాలను పురస్కరించుకుని ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన వారణాసి, ప్రయాగ్‌రాజ్‌లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గంగా, యమునా నదులలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
xPress24, Hyderabad, November 24,
నెల రోజుల పాటు సాగే కార్తీక స్నానాల ముగింపుతో పాటు దేవ దీపావళి, గురు నానక్ జయంతి కూడా ఒకే రోజు రావడంతో ఈ పర్వదినం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. తెల్లవారుజాము నుంచే నదీ ఘాట్‌లకు చేరుకున్న భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు, తులసి పూజలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమి నాడు నదీ స్నానం చేస్తే ఏడాది పొడవునా చేసే ధార్మిక ఆచారాలతో సమానమైన పుణ్యఫలం లభిస్తుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు.
దేవ దీపావళి వేడుకల్లో భాగంగా మంగళవారం సాయంత్రం 5 గంటల 15 నిమిషాల నుండి 5 గంటల 45 నిమిషాల మధ్య కాశీలోని 88 శాశ్వత ఘాట్‌లు, 103 కుండాలు, గంగా తీర ఇసుక తిన్నెలపై 11 లక్షలకు పైగా మట్టి, ఆవు పేడ దీపాలను వెలిగించనున్నారు. అనంతరం ఆరు గంటలకు మహా గంగా హారతి నిర్వహించనున్నారు. దశాశ్వమేధ ఘాట్ వద్ద కార్గిల్ అమరవీరులకు నివాళిగా 21 క్వింటాళ్ల పూలు, 51 వేల దీపాలతో ప్రత్యేక హారతి ఇవ్వనున్నారు.
సాంప్రదాయంతో పాటు ఆధునిక సాంకేతికతను మేళవిస్తూ మంగళవారం రాత్రి 7 గంటల 20 నిమిషాలకు చేత్ సింగ్ ఘాట్ వద్ద 3డీ లేజర్ షో నిర్వహించనున్నారు. రాత్రి 8 గంటలకు 2 వేల వంద స్వదేశీ డ్రోన్‌లతో శివ తత్వాన్ని చాటే వైమానిక ప్రదర్శన జరగనుంది. అనంతరం పర్యావరణ హిత బాణసంచా కాల్చనున్నారు. భారీ జనసందోహాన్ని దృష్టిలో ఉంచుకుని ఉత్తరప్రదేశ్ యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది.