ఆంధ్రప్రదేశ్
విశాఖపట్నం, తిరుపతి, అమరావతి ఎకనమిక్ రీజియన్లలో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం
19-11-2026 17:40

ఉత్తరాంధ్రలో పోర్టులు, ఐటీ, డేటా సెంటర్లు, భారీ పరిశ్రమల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
xPress24, Amaravati, November 19,
అమరావతి, 19 నవంబర్ 2026 :ఉత్తరాంధ్రలో పోర్టులు, ఐటీ, డేటా సెంటర్లు, భారీ పరిశ్రమల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విశాఖపట్నం, తిరుపతి, అమరావతి ఎకనమిక్ రీజియన్ల అభివృద్ధిపై ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ మూడు ఆర్థిక ప్రాంతాల్లో చేపట్టిన ప్రణాళికలు, అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పన, పరిశ్రమల స్థాపన తదితర అంశాలపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాయలసీమలో సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, గ్రీన్ ఎనర్జీ పరిశ్రమలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో క్వాంటం టెక్నాలజీ, ఐటీ, లాజిస్టిక్స్, పోర్టు ఆధారిత పరిశ్రమలు, అగ్రి వాల్యూ చైన్ రంగాల అభివృద్ధికి కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు.
మూడు ఆర్థిక ప్రాంతాల్లో పెట్టుబడులు ఆకర్షించడం, ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వివరించారు. విశాఖ ఎకనమిక్ రీజియన్ (VER) పరిధిలో వివిధ శాఖలకు సంబంధించి 167 అభివృద్ధి పనులను గుర్తించగా, ఇప్పటికే 64 పనులను ప్రభుత్వం ప్రారంభించిందన్నారు.
మధురవాడ, కాపులుప్పాడ, ఆనందపురం ప్రాంతాల్లో ఐటీ, డేటా సెంటర్ హబ్‌ల అభివృద్ధితో పాటు విశాఖలో స్టీల్ సిటీ, కాకినాడలో ఇండస్ట్రియల్ సిటీ, పోర్టుల విస్తరణకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. విశాఖలో కొత్తగా 15 నుంచి 20 ఐటీ సంస్థలను ఆకర్షించడంతో పాటు ఇప్పటికే ఉన్న సంస్థల ద్వారా 2 లక్షల ఉద్యోగాల కల్పనకు ఇచ్చిన హామీని కార్యరూపంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
హార్టికల్చర్ హబ్‌లో భాగంగా డెయిరీ ప్రాసెసింగ్, మీట్ అండ్ పౌల్ట్రీ, ఆయిల్‌పామ్ ప్రాసెసింగ్, టెర్మినల్ మార్కెట్ల ఏర్పాటుకు వివిధ క్లస్టర్లను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
తిరుపతి ఎకనమిక్ రీజియన్ పరిధిలోని 14 పట్టణాలను వివిధ రంగాలకు అనుగుణంగా పారిశ్రామిక నగరాలుగా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలిపారు. అలాగే అమరావతి ఆర్థిక ప్రాంతంలో 48 ప్రధాన ప్రాజెక్టుల ద్వారా రూ.4.65 లక్షల కోట్ల పెట్టుబడులను కార్యరూపంలోకి తీసుకొచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అధికారులు వెల్లడించారు.