జాతీయం
వీసా విధానాన్ని సరళతరం చేసిన కేంద్ర ప్రభుత్వం
12-11-2026 14:53
విదేశీ పౌరుల వీసా ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం సరళతరం చేసింది. ప్రాథమిక కేటగిరీలను 9కి తగ్గించి, దరఖాస్తు ఫీల్డ్‌లను భారీగా కుదించింది. ఈ ఏడాది చివరి నాటికి కొత్త విధానంలో వీసాలు జారీ చేయనున్నారు.
xPress24, Delhi, November 12,
విదేశీ పౌరుల కోసం వీసా ప్రక్రియను మరింత సరళతరం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా వీసా విధానంలో సమగ్రమైన మార్పులు చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక చర్యలు తీసుకుంది. ప్రాథమిక వీసా కేటగిరీల సంఖ్యను 13 నుంచి 9కి తగ్గించగా, ఉప-కేటగిరీలను 49 నుంచి 23కి కుదించారు. అలాగే దరఖాస్తులలో నింపాల్సిన ఫీల్డ్‌ల సంఖ్యను 65 శాతం నుంచి 70 శాతం మేర తగ్గించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రపంచ ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేసి ఈ విధానాన్ని రూపొందించామని, ఈ ఏడాది చివరి నాటికి కొత్త ఫ్రేమ్‌వర్క్ కింద వీసాలు జారీ చేస్తామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.
9 ప్రధాన కేటగిరీలుగా వీసా విధానం
కొత్త విధానంలో 9 ప్రధాన కేటగిరీలు ఉంటాయి. టూరిస్ట్ వీసా పేరును విజిటర్ వీసాగా మార్చి V-1, V-2లుగా విభజించారు. V-1 కింద స్వల్పకాలిక పర్యటనలు, వైద్య సంప్రదింపులు ఉండగా, V-2 కింద దీర్ఘకాలిక సందర్శనలు, పర్వతారోహణకు అవకాశం కల్పించారు. విద్యార్థి వీసాలను S-1, S-2లుగా, వ్యాపార వీసాలను B-1, B-2లుగా విభజించినట్లు అధికారులు పేర్కొన్నారు.