ఆంధ్రప్రదేశ్
శుక్రవారం సాయంత్రంలోగా కోనసీమ జిల్లావ్యాప్తంగా విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలి: మంత్రి అచ్చెన్నాయుడు
30-10-2026 16:54

అర్నాబ్ తుఫాను ప్రభావంతో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించి, శుక్రవారం సాయంత్రంలోగా జిల్లా అంతటా విద్యుత్ సరఫరాను అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు.
xPress24, Amalapuram, October 30,
అమలాపురం, అక్టోబర్ 30:
అర్నాబ్ తుఫాను ప్రభావంతో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించి, శుక్రవారం సాయంత్రంలోగా జిల్లా అంతటా విద్యుత్ సరఫరాను అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు.
అమలాపురంలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో సీఎండీ, ఉన్నతాధికారులు, సిబ్బందితో మంత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తుఫాను కారణంగా జిల్లాలో విద్యుత్ స్తంభాలు నేలకొరగడం, విద్యుత్ తీగలు తెగిపోవడం, విద్యుత్ లైన్లపై చెట్లు కూలిపోవడంతో సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని తెలిపారు. పలు గ్రామాలు అంధకారంలో ఉండటంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ, కొనసాగుతున్న మరమ్మతు పనులు, పునరుద్ధరణకు అవసరమైన సిబ్బంది, సామగ్రి వివరాలను సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, అర్నాబ్ తుఫాను కోనసీమ జిల్లాలో తీవ్ర బీభత్సం సృష్టించిందని, ముఖ్యంగా విద్యుత్ వ్యవస్థకు భారీ నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాలను అడ్డుకోవడం సాధ్యం కాకపోయినా, వాటి కారణంగా సంభవించే ప్రాణ, ఆస్తి నష్టాలను సాధ్యమైనంత వరకు తగ్గించేందుకు ముందస్తు జాగ్రత్తలు కీలకమని అన్నారు.
తుఫాను హెచ్చరికలు వెలువడినప్పటి నుంచి తీరాన్ని దాటే వరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేస్తూ, సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షించారని మంత్రి తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విద్యుత్ పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.