ఆంధ్రప్రదేశ్
శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు 3 వేల మంది పోలీసులతో బందోబస్తు
26-10-2026 14:29
విజయనగరం ప్రజల ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి తొలేళ్లు, సిరిమానోత్సవాలకు సుమారు 3 వేల మంది పోలీసులతో పటిష్ట భద్రత, బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ తెలిపారు.
xPress24, Vizianagaram, October 26,
విజయనగరం, అక్టోబర్ 26:
విజయనగరం ప్రజల ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి తొలేళ్లు, సిరిమానోత్సవాలకు సుమారు 3 వేల మంది పోలీసులతో పటిష్ట భద్రత, బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ తెలిపారు. భక్తులు ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకునేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టామని పేర్కొన్నారు. ఈ నెల 26, 27 తేదీల్లో జరగనున్న ఉత్సవాల నేపథ్యంలో బారికేడ్ల నిర్మాణ పనులు, భద్రతా ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించి, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
భారీ సంఖ్యలో తరలివచ్చే భక్తుల రద్దీని తట్టుకునేలా బారికేడ్ల నిర్మాణాన్ని పటిష్టంగా చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. వివిధ మార్గాల ద్వారా పట్టణానికి వచ్చే భక్తులు తమ వాహనాలను సూచించిన పార్కింగ్ స్థలాల్లోనే నిలిపి, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులకు సహకరించాలని కోరారు.
వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులు సులభంగా అమ్మవారిని దర్శించుకునేందుకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు పోలీసు సేవాదళ్‌ను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఉత్సవాల రద్దీలో భక్తులు విలువైన ఆభరణాలను ధరించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తమ వస్తువుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.
ఉత్సవాలకు వచ్చే భక్తులు పోలీసుల సూచనలు, నిబంధనలు పాటిస్తూ సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.