తెలంగాణ
సీఐడీ రూపొందించిన ఏడు నూతన డిజిటల్ సేవలు ప్రారంభం
29-10-2026 09:46

తెలంగాణ పోలీస్ శాఖ సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత విస్తృతం చేస్తూ సరికొత్త శకానికి నాంది పలికింది. నేర పరిశోధనలో జవాబుదారీతనం పెంచే లక్ష్యంతో నేర పరిశోధన విభాగం... సీఐడీ రూపొందించిన ఏడు నూతన డిజిటల్ సేవలను రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో ప్రారంభించారు.
xPress24, Hyd, October 28,
పోలీస్ స్టేషన్లలో ఎఫ్‌ఐఆర్‌ల నమోదు, పిటిషన్ల పరిష్కారం, పాస్‌పోర్ట్ వెరిఫికేషన్, ఈ-చలాన్ల వంటి సేవలపై ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాలు సేకరించేందుకు 'సిటిజన్ ఫీడ్‌బ్యాక్ సెంటర్' ను ఏర్పాటు చేశారు. అలాగే మహిళలు, చిన్నారుల రక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 35 భరోసా కేంద్రాలను ఒకే గొడుగు కిందికి తెస్తూ ప్రత్యేక 'భరోసా సాఫ్ట్‌వేర్'ను అందుబాటులోకి తెచ్చారు. ఇక సీఐడీ సమగ్ర సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌తో పాటు, జైళ్ల నుంచి విడుదలయ్యే నిందితుల కదలికలపై నిఘా ఉంచేందుకు 'జైల్ రిలీజ్ మానిటరింగ్ సిస్టమ్' ను ఈ-ప్రిజన్స్, సీసీటీఎన్‌ఎస్‌లతో అనుసంధానించారు.
ఇక నేర పరిశోధన రంగంలో విప్లవాత్మక మార్పుగా 9.8 లక్షల ఫొటోల డేటాతో రూపొందించిన 'మొబైల్ ఫేస్ సెర్చ్ యాప్' ద్వారా కేవలం 15 సెకన్లలోనే అనుమానితులు, తప్పిపోయిన వ్యక్తులు, గుర్తుతెలియని మృతదేహాల ముఖాలను సరిపోల్చవచ్చు. అంతేకాకుండా, దేశంలోనే మొట్టమొదటిసారిగా ఘటనా స్థలంలో ఆండ్రాయిడ్ ఫోన్ల సాయంతోనే వేలిముద్రలను సేకరించి సెకన్లలో సరిపోల్చే 'క్రైమ్ సీన్ ఛాన్స్ ప్రింట్ యాప్'ను ప్రవేశపెట్టారు. దర్యాప్తును మరింత పకడ్బందీగా నిర్వహించి న్యాయస్థానాల్లో నేర నిరూపణ శాతాన్ని పెంచేందుకు వీలుగా శారీరక, ఆస్తి నేరాలు, మహిళలపై నేరాలకు సంబంధించి ఐదు సంపుటాల ప్రామాణిక కార్యాచరణ మార్గదర్శకాలను డీజీపీ విడుదల చేశారు.