తెలంగాణ
సికింద్రాబాద్ లో 27వ అఖిల భారత పోలీసు బ్యాండ్ పోటీలు ప్రారంభం
16-11-2026 14:17

పోలీసు శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లో 27వ అఖిల భారత పోలీసు బ్యాండ్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభోత్సవంలో రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ పాల్గొన్నారు.
xPress24, Hyderabad, November 16,
పోలీసుల కఠినమైన విధుల్లో మానసిక ఉల్లాసానికి, ప్రశాంతతకు సంగీతం ఎంతో దోహదపడుతుందని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. సికింద్రాబాద్ హకీంపేటలోని సీఆర్పీఎఫ్ గ్రూప్ సెంటర్ వేదికగా 27వ ఆల్ ఇండియా పోలీస్ బ్యాండ్ పోటీలు ప్రారంభమయ్యాయి. 'హార్మొనీ ఇన్ సర్వీస్' నినాదంతో సీఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలు నేటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ ప్రారంభోత్సవ వేడుకలకు రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. పోటీల ప్రారంభంలో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పోలీస్ బ్యాండ్ బృందాలు ప్రదర్శించే సంగీత విన్యాసాలు పోలీసుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతాయని పేర్కొన్నారు. పోలీస్ బ్యాండ్ అనేది బలగాల క్రమశిక్షణ, ఆత్మగౌరవానికి ప్రతీక అని.. ఈ సంప్రదాయానికి దేశంలో శతాబ్దాల చరిత్ర ఉందని తెలిపారు.
మహిళల భాగస్వామ్యం పెరుగుతుండటం శుభపరిణామం: డీజీపీ
అలాగే పోలీస్ శాఖల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతుండడం శుభపరిణామం అని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. సీఆర్పీఎఫ్, పోలీసుల మధ్య ఎన్నో ఏళ్లుగా సంత్సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా దేశ భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో సమన్వయం, పరస్పర సహకారం అత్యంత కీలకమని చెప్పారు.