తెలంగాణ
సింగరేణి సమస్యల పరిష్కారానికి పరిరక్షణ యాత్ర: టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి
18-11-2026 10:09
సింగరేణి సమస్యల పరిష్కారానికి కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా గోలేటి నుంచి ఖమ్మం జిల్లా సత్తుపల్లి వరకు పరిరక్షణ యాత్ర చేపట్టనున్నట్లు టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి తెలిపారు. గోదావరిఖనిలో జరిగిన సంఘం కేంద్ర కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రూ. 60 వేల కోట్ల బకాయిలు, బొగ్గు గనుల కేటాయింపు, మెడికల్ బోర్డు ఏర్పాటుతో పాటు గుర్తింపు సంఘం ఎన్నికలను వెంటనే నిర్వహించాలని డిమాండ్ చేశారు.
xPress24, Ramagundam, November 18,
సింగరేణి వ్యాప్తంగా నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 'సింగరేణి పరిరక్షణ యాత్ర' చేపట్టనున్నట్లు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో నిర్వహించిన సంఘం కేంద్ర కమిటీ సమావేశంలో ఈ మేరకు తీర్మానించినట్లు వెల్లడించారు. కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని గోలేటి నుంచి ఖమ్మం జిల్లా సత్తుపల్లి వరకు ఈ యాత్ర కొనసాగుతుందని, ఇందులో బీఆర్ఎస్ రాష్ట్ర నేతలు పాల్గొంటారని పేర్కొన్నారు. సింగరేణి వ్యాప్తంగా అన్ని రీజియన్ కేంద్రాల్లో దీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు.
రూ. 60 వేల కోట్ల బకాయిలు, గుర్తింపు సంఘం ఎన్నికలపై డిమాండ్
సింగరేణి సంస్థకు రావాల్సిన రూ. 60 వేల కోట్ల బకాయిల విడుదల, బొగ్గు గనుల కేటాయింపు, మారుపేర్ల సమస్య పరిష్కారం, కార్మికుల సొంత ఇంటి కోసం స్థల కేటాయింపు, మెడికల్ బోర్డు ఏర్పాటు వంటి అంశాలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లేందుకు దీక్షలు నిర్వహిస్తామని రాజిరెడ్డి వివరించారు. సింగరేణిలో గుర్తింపు సంఘం కాలపరిమితి పూర్తయినందున వెంటనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. 12వ వేతన సవరణ ఒప్పందం ఆలస్యం అవుతున్నందున కార్మికులకు మధ్యంతర భృతి అందించేలా జాతీయ సంఘాలు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందిన కేంద్ర కార్యవర్గ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.
బైట్
మిరియాల రాజిరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్)