జాతీయం
సీజేఐపై అనుచిత వ్యాఖ్యల కేసులో న్యాయవాదికి సుప్రీం నోటీసులు
19-11-2026 09:39

భారత ప్రధాన న్యాయమూర్తిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో న్యాయవాది ప్రవీణ్ సింఘాల్‌కు అత్యున్నత న్యాయస్థానం కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. సీజేఐపై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని..2027, జనవరి 20న తదుపరి విచారణకు వ్యక్తిగతం హాజరుకావాలని సుప్రీంకోర్టు న్యాయవాది సింఘాల్‌ను ఆదేశించింది.
xPress24, Delhi, November 18,
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో న్యాయవాది ప్రవీణ్ సింఘాల్‌కు అత్యున్నత న్యాయస్థానం కోర్టు ధిక్కరణ నోటిసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ పిటిషన్(SCBA) దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై బుధవారం న్యాయమూర్తులు దీపాంకర్ దత్తా, జోయ్‌మల్యా బాగ్చీ, వి. మోహనలతో కూడిన ప్రత్యేక త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. రికార్డులను, అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి ఇచ్చిన అనుమతిని పరిశీలించిన తర్వాత SCBA అభ్యర్థనపై తదుపరి విచారణకు స్వీకరించేందుకు ప్రాథమిక ఆధారులన్నట్లు త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. ఈ మేరకు న్యాయవాది సింఘాల్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేస్తూ.. 2027, జనవరి 20లోగా వివరణ ఇచ్చి, తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది.
ఈనెల 16న బహిరంగ కోర్టులో సీజేఐ, జస్టిస్ జోయ్‌మల్యా బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం ముందు సింఘాల్ హాజరై, తన పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలని కోరినప్పుడు ఈ వివాదం మొదలైంది. ఈ సందర్భంగా సీజేఐపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని, సీజేఐ కుర్చీలో కూర్చునే ఆయన హక్కును కూడా ప్రశ్నించారని ఆరోపణలు ఉన్నాయి.ఈనెల 2న సీజేఐ కార్యాలయానికి లేఖ పంపానని.. 15 రోజులు గడిచినప్పటికీ ఎలాంటి సమాధానం రాలేదని సింఘాల్ పేర్కొన్నారు. తన అభ్యర్థనపై వెంటనే విచారణ చేపట్టాలని పట్టుబట్టగా.. వేచి ఉండాలని సీజేఐ సూచించినప్పుడు, సదరు న్యాయవాది అందుకు నిరాకరించి ప్రధాన న్యాయమూర్తిపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈనెల 16న జరిగిన ఘటన అత్యంత అగౌరవకరమైనదని, ఇలాంటి ఘటనల్ని ఉపేక్షించకూడదని SCBA అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది ప్రదీప్ రాయ్ కోర్టుకు తెలిపారు. బహిరంగ కోర్టులో సీజేఐపై "అనుచిత వ్యాఖ్యలు" చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు.సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా SCBA పిటిషన్‌కు మద్దతు తెలుపుతూ, న్యాయస్థానం యొక్క "ఔన్నత్యం, గౌరవాన్ని" కాపాడాలని విన్నవించారు. అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి తన అనుమతి లేఖలో సింఘాల్ ప్రవర్తనను "అత్యంత అవమానకరమైనది, క్షమించరానిది"గా అభివర్ణిస్తూ, ఈ కేసులో కోర్టు ధిక్కార చట్టంలోని సెక్షన్ 15(1)(b) కింద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తదుపరి విచారణ సమయంలో సొలిసిటర్ జనరల్ సహాయం తీసుకుంటామని ధర్మాసనం తెలిపింది.