ఆంధ్రప్రదేశ్
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఓటింగ్ శాతం పెరిగింది: వైఎస్ జగన్
12-11-2026 09:42

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పలు జిల్లాలకు చెందిన పార్టీ నాయకులతో జగన్ సమావేశమయ్యారు.
xPress24, Amaravati, November 11,
గుంటూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ వరకు ప్రతి దశలోనూ అధికార తెలుగుదేశం పార్టీ అక్రమాలకు పాల్పడినప్పటికీ వైఎస్సార్‌సీపీ ఓటింగ్ శాతం మరింత పెరిగిందని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పలు జిల్లాలకు చెందిన పార్టీ నాయకులతో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల తీరుపై నాయకులతో చర్చించారు.
సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులన్నీ సమష్టిగా పోరాటం చేశాయని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన అక్రమాలను రాష్ట్ర ప్రజలంతా గమనించారని, ఈ వ్యవహారాలపై ప్రజలకు కూడా స్పష్టమైన అవగాహన వచ్చిందని పేర్కొన్నారు.
2024 ఎన్నికలతో పోలిస్తే వైఎస్సార్‌సీపీ ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగిందని జగన్ తెలిపారు. ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా జరిగి ఉంటే పార్టీకి మరింత భారీగా ఓటింగ్ శాతం నమోదయ్యేదని అభిప్రాయపడ్డారు. ఎన్నికల ఫలితాలు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారతాయనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమాలకు, అరాచకాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎన్నికల్లో చోటుచేసుకున్న అక్రమాలను సమర్థించుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వైఎస్ జగన్ విమర్శించారు.