తెలంగాణ
సిద్దిపేటలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి.. కుటుంబ జీవిత బీమా పథకానికి నేడు శ్రీకారం
20-11-2026 09:52
సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ వేదిక నుంచి ప్రతి కుటుంబానికి జీవిత బీమా పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు. దీనితో పాటు సిద్దిపేట, దుబ్బాకలలో యంగ్ ఇండియా స్కూళ్లకు శంకుస్థాపన, కొమురవెల్లి దేవస్థానం వద్ద అభివృద్ధి పనులను ప్రారంభించనుండగా, మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజనర్సింహ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
xPress24, Siddipet, November 19,
సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభకు అధికార యంత్రాంగం, కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరికొద్ది గంటల్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ సభలో పాల్గొననున్నారు. సభ నేపథ్యంలో సిద్దిపేట పట్టణమంతా కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు, కటౌట్లతో నిండిపోయింది. ఇప్పటికే జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజనర్సింహ, మాజీ ఎంపీ వి. హనుమంతరావు, మైనంపల్లి హనుమంతరావుతో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు సభా ప్రాంగణాన్ని పరిశీలించి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
యంగ్ ఇండియా స్కూళ్లకు శంకుస్థాపన
సిద్దిపేట బహిరంగ సభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి జీవిత బీమా పథకాన్ని ప్రారంభించనున్నారు. దీనితో పాటు సిద్దిపేట, దుబ్బాక ప్రాంతాల్లో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు శంకుస్థాపన చేస్తారు. జిల్లాలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడంతో పాటు కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానం వద్ద చేపట్టిన అభివృద్ధి పనులను సీఎం ప్రారంభించనున్నారు.