తెలంగాణ
సూర్యాపేట జిల్లాలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు
24-11-2026 12:13
కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ప్రసిద్ధ శైవ క్షేత్రాలలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కార్తీక దీపాలు వెలిగించి.. మహాశివుడికి అభిషేకాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని ఆలయాలన్నీ భక్తులతో సందడిగా మారాయి.
xPress24, SURYAPET, November 24,
పరమశివుడికి ప్రతీకరమైన కార్తీకమాసంలో పవిత్ర పౌర్ణమి రోజు భక్తుల నామస్మరణతో ఆలయాలన్ని మారుమోగుతున్నాయి. సూర్యాపేట జిల్లాలోని పిల్లలమర్రి గ్రామంలో కొలువైన
చరిత్రాత్మక ఎరకేశ్వర మహానామేశ్వర స్వామి ఆలయంతో పాటు మఠంపల్లి, ఇతర ప్రధాన ఆలయాలకు తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
కార్తీక మాసంలో పౌర్ణమి రోజును అత్యంత శుభప్రదంగా భావించే భక్తులు వేకువజామునే పవిత్ర స్నానాలు ఆచరించి శివాలయాలను దర్శించుకుంటున్నారు. ఆలయ అర్చకులు శైవాగమ సంప్రదాయ పద్ధతిలో స్వామివారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక బిల్వార్చన, నిత్య కైంకర్యాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు.
ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయాలలో జ్వాలా తోరణం, 365 వత్తుల దీపారాధన వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అలాగే భక్తులు సమీపంలోని నదులు, చెరువులలో కార్తీక దీపాలను వదులుతూ తమ మొక్కులు చెల్లించుకుంటారు.