తెలంగాణ
హైదరాబాద్ లో బీఆర్ఎస్ చేపట్టిన మూసీ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత
29-10-2026 09:34

హైదరాబాద్ లో బీఆర్ఎస్ చేపట్టిన మూసీ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
xPress24, Hyd, October 28,
ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లకుండా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్, బీఆర్ఎస్ నేత కార్తీక్ రెడ్డి సహా పలువురు ముఖ్య నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.
ముందస్తు అరెస్టులపై మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టిసారించాల్సిన ముఖ్యమంత్రి, విపక్ష నేతలను అరెస్టు చేయడంపైనే శ్రద్ధ పెడుతున్నారని విమర్శించారు. కాగా, బీఆర్ఎస్ నేతల అరెస్టులను మాజీ మంత్రి హరీశ్ రావు కూడ తప్పుబట్టారు. ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ రాష్ట్రంలో ఎమర్జెన్సీ తరహా పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో తీవ్ర కరువు బారిన పడ్డ రైతులను, కష్టాల్లో ఉన్న సామాన్య ప్రజలను ఆదుకోవడం విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం.. మూసీ ప్రక్షాళన పేరిట లక్షా యాభై వేల కోట్ల రూపాయలను దోచుకునేందుకు సిద్ధమైందని ఆరోపించారు. పాలకులకు కమిషన్లు దండుకోవడంపై ఉన్న శ్రద్ధ, కరువుతో అల్లాడుతున్న రైతులను ఆదుకోవడం మీద లేదని హరీశ్ రావు విమర్శించారు.