తెలంగాణ
హైదరాబాద్‌లో 85వ ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సదస్సును ప్రారంభించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, సీఎం రేవంత్ రెడ్డి
20-11-2026 10:12
హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో 85వ ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సదస్సును కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 'కనెక్టింగ్ రోడ్స్ - క్రియేటింగ్ టుమారో' ఇతివృత్తంతో ఈ నెల 22 వరకు జరిగే ఈ సదస్సులో 3,500 మందికి పైగా ఇంజినీర్లు, నిపుణులు పాల్గొంటున్నారు. రోడ్ కనెక్టివిటీలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని, రహదారులపై బ్లాక్ స్పాట్స్ లేకుండా ఇంజినీర్లు బాధ్యత వహించాలని నితిన్ గడ్కరీ సూచించారు.
xPress24, Hyderabad, November 19,
హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో 85వ ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సదస్సు ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ సదస్సును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, డీకే అరుణతో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 'కనెక్టింగ్ రోడ్స్ - క్రియేటింగ్ టుమారో' అనే థీమ్‌తో ఈ నెల 22 వరకు నాలుగు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. దేశవిదేశాల నుంచి సుమారు 3,500 మందికి పైగా హైవే ఇంజినీర్లు, పరిశోధకులు, నిర్మాణ రంగ నిపుణులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇందులో పాల్గొంటున్నారు. పర్యావరణహిత రహదారుల నిర్మాణం, ఏఐ, డిజిటల్ టెక్నాలజీ వ్యవస్థలపై సదస్సులో చర్చించనున్నారు.
రహదారులపై బ్లాక్ స్పాట్స్ లేకుండా చూడాలి.. రోడ్ కనెక్టివిటీలో భారత్ నంబర్ వన్
సదస్సులో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. రహదారులు నాణ్యంగా ఉంటేనే ఏ రాష్ట్రానికైనా భారీగా పెట్టుబడులు వస్తాయని తెలిపారు. దేశంలో జాతీయ రహదారుల నిర్మాణంలో నాణ్యత పాటిస్తూ అనేక రికార్డులు సాధించామని, ఇందులో ఇంజినీర్ల పాత్ర కీలకమని పేర్కొన్నారు. రోడ్ కనెక్టివిటీలో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో ఉందన్నారు. దేశంలో ఏటా రోడ్డు ప్రమాదాల్లో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. ఇకపై రహదారులపై బ్లాక్ స్పాట్స్ కనిపించకుండా చూడాల్సిన బాధ్యత ఇంజినీర్లపై ఉందని నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.