జాతీయం
హర్యానా రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
02-11-2026 09:49

కురుక్షేత్ర విశ్వవిద్యాలయంలో జరిగిన హర్యానా 60వ ఆవిర్భావ వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. కురుక్షేత్ర పుణ్యభూమి గొప్పతనాన్ని, స్వాతంత్ర్య సమరయోధులైన రావు తులారామ్, దీనబంధు ఛోటూరామ్, కాన్షీరామ్ త్యాగాలను కొనియాడారు.
xPress24, Haryana, November 1,
హర్యానా రాష్ట్ర 60వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కురుక్షేత్ర విశ్వవిద్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ప్రధాన వేడుకల్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. శ్రీకృష్ణ భగవానుడు నిష్కామ కర్మయోగాన్ని ప్రబోధించిన కురుక్షేత్ర పుణ్యభూమి యావత్ ప్రపంచానికే మార్గదర్శకమని కొనియాడారు.1966లో ఏర్పడిన నాటి నుంచి గత ఆరు దశాబ్దాల కాలంలో దేశ ప్రగతికి హర్యానా విశేష కృషి చేసిందని ప్రశంసించారు.
స్వాతంత్ర్య సమరయోధులు, మహాపురుషులకు ఘన నివాళి
దేశ స్వాతంత్ర్య సంగ్రామం, సామాజిక మార్పు, ప్రజాస్వామ్య పరిరక్షణ, సాహిత్యం, సైన్స్ రంగాల్లో హర్యానా బిడ్డలు అందించిన సహకారాన్ని రాష్ట్రపతి ప్రత్యేకంగా స్మరించుకున్నారు. రావు తులారామ్ అదమ్య సాహసం, అన్నదాతల సంక్షేమానికి పాటుపడిన దీనబంధు సర్ ఛోటూరామ్, పండిత్ నేకీరామ్ శర్మ దేశ సేవ, దాదా లక్ష్మీచంద్ సంస్కృతీ సాధన హర్యానాకు అమూల్యమైన వారసత్వమని పేర్కొన్నారు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో లాలా హరదయాళ్‌తో కలిసి గద్దర్ పార్టీని స్థాపించిన అంబాలాకు చెందిన తొలి తరం అమరవీరుడు కాన్షీరామ్ త్యాగాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ఆరు దశాబ్దాల ప్రస్థానం.. ఛాయాచిత్ర ప్రదర్శన ప్రారంభం
కురుక్షేత్ర విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రస్థాన ఛాయాచిత్ర ప్రదర్శనను రాష్ట్రపతి ప్రారంభించారు. వ్యవసాయం, హరిత విప్లవం, క్రీడలు, పారిశ్రామిక అభివృద్ధి, మహిళా సాధికారతతో పాటు 'హర్యానా విజన్ 2047' రోడ్‌మ్యాప్‌ను ప్రతిబింబించే విభాగాలను పరిశీలించారు. అనంతరం నగరంలోని చారిత్రక మా భద్రకాళి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బైట్
ద్రౌపది ముర్ము, రాష్ట్రపతి