ఆంధ్రప్రదేశ్
142 మంది పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా నిర్వహణ
26-09-2026 17:17

చిత్తూరు జిల్లాలోని పోలీస్ శిక్షణా కేంద్రంలో ఎస్‌సీటీ పీసీ (స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్) 2025 బ్యాచ్‌కు చెందిన 142 మంది కానిస్టేబుల్ శిక్షణార్థుల పాసింగ్ అవుట్ పరేడ్‌ను ఘనంగా నిర్వహించారు.
xPress24, Chittoor, September 26,
చిత్తూరు:
చిత్తూరు జిల్లాలోని పోలీస్ శిక్షణా కేంద్రంలో ఎస్‌సీటీ పీసీ (స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్) 2025 బ్యాచ్‌కు చెందిన 142 మంది కానిస్టేబుల్ శిక్షణార్థుల పాసింగ్ అవుట్ పరేడ్‌ను ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన శిక్షణార్థులు తొమ్మిది నెలల కఠిన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకుని పోలీస్ విధుల్లోకి ప్రవేశించారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా, యువజన క్రీడల శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉన్నత విద్యావంతులు పోలీస్ సేవల్లోకి రావడం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వివిధ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పోలీస్ శాఖలో 5 వేల కానిస్టేబుల్ పోస్టులకు ఒకేసారి నోటిఫికేషన్ జారీ చేసి నియామక ప్రక్రియను పూర్తి చేసినట్లు తెలిపారు.
పోలీస్ విధుల్లో క్రమశిక్షణ, నిజాయితీ, బాధ్యతతో పనిచేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని శిక్షణార్థులకు సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ నేరాలు వంటి కొత్త సవాళ్ల నేపథ్యంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని అన్నారు.
జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ.. కానిస్టేబుల్ ప్రజలకు అత్యంత చేరువగా ఉండే ప్రభుత్వ ప్రతినిధి అని అన్నారు. ప్రజలు పోలీసుల నుంచి భద్రత, న్యాయం, మెరుగైన సేవలను ఆశిస్తారని తెలిపారు. విధుల్లో చట్టబద్ధంగా, నిష్పక్షపాతంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
జిల్లా ఎస్పీ తుషార్ డూడి మాట్లాడుతూ.. తొమ్మిది నెలల శిక్షణలో సాధించిన క్రమశిక్షణ, ఉత్సాహం, సమర్థతను విధుల్లోనూ కొనసాగించాలని శిక్షణార్థులకు సూచించారు. నీతి, నిజాయితీతో పనిచేసి పోలీస్ శాఖకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, చుడా చైర్మన్ కటారి హేమలత, పోలీస్ ఉన్నతాధికారులు, శిక్షణార్థుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం శిక్షణలో ప్రతిభ కనబరిచిన శిక్షణార్థులను అధికారులు అభినందించారు.