క్రీడలు
ఆసియా క్రీడల విజేతలకు సీఎం చంద్రబాబు అభినందనలు
07-10-2026 17:47
2026 ఆసియా క్రీడల్లో విశేష ప్రతిభ కనబరిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఖ్యాతి తీసుకొచ్చిన క్రీడాకారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు.
xPress24, Amaravati, October 7,
అమరావతి:
2026 ఆసియా క్రీడల్లో విశేష ప్రతిభ కనబరిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఖ్యాతి తీసుకొచ్చిన క్రీడాకారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. ఆసియా క్రీడల విజేతలు బుధవారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా క్రీడాకారులు సాధించిన పతకాలు, వారి అత్యుత్తమ ప్రదర్శనను ముఖ్యమంత్రి కొనియాడారు. అంతర్జాతీయ వేదికలపై దేశం, రాష్ట్రం పేరును నిలబెట్టిన క్రీడాకారుల ప్రతిభను అభినందిస్తూ, రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించి అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.
క్రీడాకారులు శ్రీ చరణి, గణేష్ మణిరత్నం, ధీరజ్ బొమ్మదేవర, వెన్నం జ్యోతిసురేఖ తదితరులు ముఖ్యమంత్రిని కలిశారు. మొత్తం మూడు క్రీడాంశాల్లో రాష్ట్ర క్రీడాకారులు మూడు స్వర్ణ పతకాలు, రెండు రజత పతకాలు, మూడు కాంస్య పతకాలతో కలిపి మొత్తం ఎనిమిది పతకాలను సాధించినట్లు శాప్ ఎండీ భరణి ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు.
భవిష్యత్తులో రాష్ట్రం నుంచి మరింత మంది క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించేలా ప్రభుత్వం పూర్తి ప్రోత్సాహాన్ని అందిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. క్రీడాకారులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించి, వారి ప్రతిభను మరింతగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని వెల్లడించారు.