క్రీడలు
ఆసియా క్రీడల్లో భారత షూటర్ల అద్భుత ప్రదర్శన
30-09-2026 14:05
మహిళల ట్రాప్ టీమ్ ఈవెంట్‌లో నీరు, ఆషిమా అహ్లావత్, మనీషా కీర్‌లతో కూడిన భారత త్రయం రజత పతకం సాధించింది.
xPress24, Hyderabad, September 29,
జపాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత షూటర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. మహిళల ట్రాప్ టీమ్ ఈవెంట్‌లో నీరు, ఆషిమా అహ్లావత్, మనీషా కీర్‌లతో కూడిన భారత త్రయం రజత పతకం సాధించింది. మొత్తం 328 పాయింట్లు సాధించి భారత్ రెండో స్థానంలో నిలవగా, చైనా స్వర్ణం, కువైట్ కాంస్య పతకాలను గెలుచుకున్నాయి. భారత షూటర్ నీరు 118 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి వ్యక్తిగత ఫైనల్స్‌కు అర్హత సాధించింది.
ఆర్చరీ పురుషుల రికర్వ్ విభాగంలో భారత విలువిద్యా వీరులు ధీరజ్ బొమ్మదేవర, నీరజ్ చౌహాన్ క్వార్టర్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టారు. రౌండ్ ఆఫ్ 16 పోరులో ధీరజ్ చైనీస్ తైపీకి చెందిన చెంగ్ హ్సియాంగ్-హుయ్‌పై, నీరజ్ దక్షిణ కొరియాకు చెందిన కిమ్ జె-డియోక్‌పై విజయం సాధించి ముందంజ వేశారు. మహిళల స్క్వాష్ పూల్ మ్యాచ్‌లో భారత జట్టు ఇరాన్‌పై 3-0 తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. అనాహత్ సింగ్, జోష్నా చిన్నప్ప, తన్వి ఖన్నా తమ ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. గ్రూప్ దశలోని మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన భారత మహిళల జట్టు క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది.