అంతర్జాతీయం
ఇరాన్ కు గట్టి వార్నింగ్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్
07-10-2026 09:59
బ్రిటన్‌లోని సైనిక స్థావరం నుంచి అమెరికా తన మిలిటరీ బాంబర్లను తరలించడంతో ఇరాన్ ప్రమేయం ఉన్నట్లు తేలితే ఆ దేశం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
xPress24, Hyderabad, October 6,
బ్రిటన్‌లోని సైనిక స్థావరం నుంచి అమెరికా తన మిలిటరీ బాంబర్లను తరలించడానికి కొన్ని భద్రతా ముప్పులే కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఒకవేళ ఈ భద్రతా ముప్పు వెనుక ఇరాన్ ప్రమేయం ఉన్నట్లు తేలితే ఆ దేశం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. తమ నిఘా వర్గాలు ఈ బెదిరింపులకు పాల్పడిన వారిని గుర్తించాయని, వారికి త్వరలోనే తగిన శాస్త్రి చెబుతామని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన 'ఫ్లైదుబాయ్' విమాన భద్రతా ఘటనకు ఇరానే కారణమని తాను వ్యక్తిగతంగా నమ్ముతున్నట్లు ట్రంప్ వెల్లడించారు. మరోవైపు, వైస్ ప్రెసిడెంట్ జె.డి. వాన్స్ దీనిపై స్పందిస్తూ ఇరాన్ ప్రమేయంపై ఇప్పటివరకు ఎటువంటి స్పష్టమైన ఆధారాలు లభించలేదని తెలిపారు. ఇరాన్‌పై గట్టి హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, ఆ దేశ నాయకత్వంతో ప్రత్యక్ష చర్చలు జరపడానికి తాను ఇప్పటికీ సుముఖంగానే ఉన్నానని ట్రంప్ స్పష్టం చేశారు. రష్యా చమురు శుద్ధి కర్మాగారాలపై దాడుల కారణంగా డీజిల్ లభ్యతలో తాత్కాలిక అంతరాయం ఏర్పడినప్పటికీ, అంతర్జాతీయంగా పెట్రోల్, చమురు ధరలు వేగంగా తగ్గుముఖం పడుతున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.