ఆంధ్రప్రదేశ్
ఉత్సవాల వైభవాన్ని భావితరాలకు అందించడమే లక్ష్యం: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
13-10-2026 16:08
కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి జాతరలో పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన కేంద్ర మంత్రి
xPress24, Srikakulam, October 13,
శ్రీకాకుళం జిల్లా, అక్టోబర్ 13:
మన ఆచార సంప్రదాయాలకు ఉత్సవాలే మూలమని, వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక వైభవాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని భావితరాలకు ఘనంగా అందించడమే లక్ష్యమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ దిశగా సమర్థవంతంగా కృషి చేస్తోందని పేర్కొన్నారు.
శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవమైన కొత్తమ్మతల్లి జాతర మహోత్సవాల్లో మంగళవారం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తన కుటుంబ సభ్యులతో పాటు రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకుల వేద ఆశీర్వచనాలు స్వీకరించారు. జాతరలో ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేసిన హెలికాప్టర్ రైడ్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, కొత్తమ్మతల్లి తమ కుటుంబానికి ఆరాధ్య దైవమని, ఉత్తరాంధ్ర ఇలవేల్పు అయిన అమ్మవారి జాతర మహోత్సవాల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. రాష్ట్ర పండుగ హోదాలో ఈ ఏడాది కూడా ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడం సంతోషకరమని అన్నారు.
కొత్తమ్మతల్లి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతోందని కేంద్ర మంత్రి వెల్లడించారు. ప్రతి ఏడాది జాతర మహోత్సవాలను మరింత ఘనంగా నిర్వహించడంతో పాటు, ప్రస్తుతం రూ.5 కోట్లతో ఆలయ పరిసరాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలను మరింత విస్తరించి, అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా అభివృద్ధి పనులు కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు.