ఆంధ్రప్రదేశ్
ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై అధికారులకు సమగ్ర శిక్షణ
16-10-2026 16:39
శ్రీ సత్యసాయి జిల్లాలో ఎంపీటీసీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు రిటర్నింగ్ అధికారులు (ఆర్ఓలు), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు (ఏఆర్ఓలు), ఇతర అధికారులకు శుక్రవారం పుట్టపర్తి ఎండీఓ కార్యాలయంలో సమగ్ర శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
xPress24, Puttaparthi, October 16,
పుట్టపర్తి:
శ్రీ సత్యసాయి జిల్లాలో ఎంపీటీసీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు రిటర్నింగ్ అధికారులు (ఆర్ఓలు), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు (ఏఆర్ఓలు), ఇతర అధికారులకు శుక్రవారం పుట్టపర్తి ఎండీఓ కార్యాలయంలో సమగ్ర శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ గోవిందరాజులు మాస్టర్ ట్రైనర్గా వ్యవహరించి, ఎన్నికల ప్రక్రియపై అధికారులకు క్షుణ్ణంగా శిక్షణ ఇచ్చారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల నుంచి నామినేషన్ల స్వీకరణ, పరిశీలన వరకు పాటించాల్సిన నిబంధనలను వివరించారు. పోలింగ్ సిబ్బందికి శిక్షణ, పోలింగ్ సామగ్రి పంపిణీ, పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించడం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మార్గదర్శకాలు అందించారు. అలాగే ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభం నుంచి ముగింపు వరకు పకడ్బందీగా నిర్వహించడం, ఫలితాలను ప్రకటించే విధానంపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల నిబంధనల పుస్తకాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో ఏవైనా సందేహాలు తలెత్తితే జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) లేదా జిల్లా శిక్షణ నోడల్ అధికారి, పీడీ డ్వామా విజయప్రసాద్ను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని తెలిపారు. పీఎంఎస్, ఎలక్టోరల్ ఎలక్షన్ మేనేజ్మెంట్ సిస్టమ్ పోర్టళ్లలో నివేదికలను ఎప్పటికప్పుడు కచ్చితంగా అప్లోడ్ చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ వెంకట సుబ్బయ్య, జిల్లా శిక్షణ నోడల్ అధికారి, పీడీ డ్వామా విజయప్రసాద్, వివిధ శాఖల జిల్లా అధికారులు, డివిజనల్ అభివృద్ధి అధికారులు, ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు. అధికారులు శిక్షణ కార్యక్రమాన్ని శ్రద్ధగా స్వీకరించారు.