అంతర్జాతీయం
ఐరాస వేదికగా పాకిస్థాన్ తీరును ఎండగట్టిన భారత్
09-10-2026 09:40
పాకిస్థాన్ పెంచి పోషించిన ఉగ్రవాదమే ఇప్పుడు ఆ దేశాన్ని వెంటాడుతోందని భారత్ స్పష్టం చేసింది. ఐరాస వేదికగా పాక్ చేసిన అసత్య ఆరోపణలను భారత మిషన్ ఫస్ట్ సెక్రటరీ రఘూ పురి తిప్పికొట్టారు.
xPress24, New york, October 8,
పాకిస్థాన్ పెంచి పోషించిన ఉగ్ర రాక్షసి ఇప్పుడు దానినే వెంటాడుతోందని భారత్ చురకలు అంటించింది. పొరుగు దేశంలో విధ్వంసం సృష్టించడానికి పాక్ ఈ ఉగ్రమూకలను ప్రోత్సహించిందని, ఇప్పుడు అదే ఆ దేశంలో అశాంతిని సృష్టిస్తోందని ఐరాస వేదికగా భారత మిషన్ ఫస్ట్ సెక్రటరీ రఘూ పురి విమర్శించారు. పాక్ మిషన్‌కు చెందిన ప్రతినిధి భారత్‌పై చేసిన ఆరోపణలకు ఈ విధంగా కౌంటర్ ఇచ్చారు. అలాగే దాయాది ప్రచారం చేస్తోన్న కట్టుకథలను పూర్తిగా తోసిపుచ్చారు. ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ బాధితుడిగా నటించడం ఆ దేశానికి తగదని హెచ్చరించారు.
పాక్ నేతల వ్యాఖ్యలను ప్రస్తావించిన భారత్
ఈ సందర్భంగా పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయన కుమార్తె, పాక్ లోని పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ గతంలో చేసిన వ్యాఖ్యలను భారత ప్రతినిధి ప్రస్తావించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అది హింసకే దారితీస్తుందని మరియం వ్యాఖ్యానించారని గుర్తుచేశారు. 2008 నాటి ముంబయి ఉగ్రదాడుల్లో పాక్‌కు చెందిన ఉగ్రవాద సంస్థల హస్తం ఉందని ఆమె తండ్రి ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంగీకరించిన విషయాన్ని వెల్లడించారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ఇప్పుడు బాధిత దేశంగా నటించడం ఎట్టిపరిస్థితుల్లో చెల్లదని గట్టిగా బదులిచ్చారు.
పాక్ అసత్య ప్రచారాలపై కౌంటర్
అలాగే పహల్గాం దాడికి ప్రతిగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో భారత్, పాక్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అయితే, భారత్ నుంచి గట్టి సమాధానం వచ్చినా తామే విజయం సాధించామని పాక్ అసత్య ప్రచారం చేసుకుంది. ఆ కట్టుకథలను రఘూ పురి తోసిపుచ్చారు. బాంబులతో ధ్వంసమైన విమానాశ్రయాలు, గుంతలు పడిన రన్‌వేలు పాకిస్థాన్‌కు విజయంగా కనిపిస్తే ఆ గెలుపునే వారు ఆస్వాదించనివ్వాలన్నారు.