ఆంధ్రప్రదేశ్
కాకినాడ యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి కోసం ‘స్కిల్, స్టార్టప్, భారత్ హబ్’
06-10-2026 09:33
కాకినాడ జిల్లా యువతకు స్థానికంగానే నైపుణ్య శిక్షణ అందించి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ‘స్కిల్, స్టార్టప్, భారత్ హబ్’ను ఏర్పాటు చేస్తున్నట్లు రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు తెలిపారు.
xPress24, Kakinada, October 5,
కాకినాడ జిల్లా, అక్టోబర్ 5:
కాకినాడ జిల్లా యువతకు స్థానికంగానే నైపుణ్య శిక్షణ అందించి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ‘స్కిల్, స్టార్టప్, భారత్ హబ్’ను ఏర్పాటు చేస్తున్నట్లు రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు తెలిపారు. సోమవారం కాకినాడ ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రాంగణంలో రూ.5.30 కోట్ల రాజ్యసభ ఎంపీ ల్యాడ్స్ నిధులతో చేపట్టిన తొలి దశ స్కిల్ సెంటర్ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, శాసనమండలి సభ్యులు పేరాబత్తుల రాజశేఖర్, కర్రి పద్మశ్రీ, కాకినాడ అర్బన్, కాకినాడ రూరల్, పెద్దాపురం, ప్రత్తిపాడు ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పంతం నానాజీ, నిమ్మకాయల చిన్నరాజప్ప, వరుపుల సత్యప్రభ, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి తదితరులతో కలిసి ఎంపీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సానా సతీష్ బాబు మాట్లాడుతూ, మూడేళ్ల క్రితం ‘కాకినాడ జిల్లా కోసం’ అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఇంటింటికీ, ప్రతి విద్యార్థికి ప్రశ్నావళి అందించి సర్వే నిర్వహించినట్లు తెలిపారు. ఈ సర్వేలో 80 శాతం మంది ఉద్యోగ, ఉపాధి సమస్యలపై ప్రధానంగా దృష్టి సారించాలని కోరారని, అందుకే యువతకు నైపుణ్య శిక్షణతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వివరించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన అనంతరం ఈ ఆలోచనకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. గత రెండేళ్లుగా స్థానిక శాసనసభ్యులు రోడ్లు, డ్రెయిన్లు, ఇతర అభివృద్ధి పనులకు నిధులు కోరడం కంటే కాకినాడ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమాలను చేపట్టాలని తనను ప్రోత్సహించారని, ఇందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
స్థానిక యువత భవిష్యత్తుకు బలమైన పునాది వేయడమే తమ ప్రధాన లక్ష్యమని ఎంపీ స్పష్టం చేశారు. ఈ హబ్ ద్వారా నైపుణ్య శిక్షణతో పాటు ముఖ్యమంత్రి ‘వన్ హోమ్–వన్ ఎంటర్‌ప్రెన్యూర్’ ఆలోచనకు అనుగుణంగా ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తీర్చిదిద్దేలా ఇన్క్యుబేషన్, స్కిల్ డెవలప్‌మెంట్ సేవలు అందిస్తామని చెప్పారు.
దేశంలోనే కాకుండా రాష్ట్రంలోనూ ఇది ఒక వినూత్నమైన హైబ్రిడ్ మోడల్ సెంటర్‌గా నిలుస్తుందని తెలిపారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ మోడల్‌ను కూడా ఇందులో సమ్మిళితం చేస్తున్నట్లు చెప్పారు. మొత్తం రూ.15 నుంచి రూ.20 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నామని, తొలి దశలో స్కిల్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని, రెండో దశలో తుని, కోనసీమ తదితర దూర ప్రాంతాల విద్యార్థులు ఇక్కడే ఉండి శిక్షణ పొందేందుకు హాస్టల్ సౌకర్యాన్ని కల్పిస్తామని వివరించారు.
కాకినాడ పరిసరాల్లోని దివీస్ ఫార్మా, అరబిందో ఫార్మా, ఏఎం గ్రీన్, కోరమండల్ ఫెర్టిలైజర్స్ తదితర ప్రముఖ పరిశ్రమల ప్రతినిధులతో ఇప్పటికే చర్చలు జరిపినట్లు తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాల్లోనే యువతకు శిక్షణ ఇచ్చి, నేరుగా ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ఒప్పందాలు చేసుకుంటున్నామని వెల్లడించారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, వెబ్ డెవలప్‌మెంట్, డ్రోన్ టెక్నాలజీ, అగ్రిటెక్, గ్రీన్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఆక్వా, ఆయిల్ అండ్ గ్యాస్ తదితర రంగాల్లో ప్రత్యేక శిక్షణ అందిస్తామని తెలిపారు. భవన నిర్మాణం పూర్తయ్యే వరకు వేచి చూడకుండా స్థానిక కళాశాలల సహకారంతో ఇప్పటికే శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించినట్లు చెప్పారు. ఐదు నెలల క్రితం బెంగళూరు నుంచి వచ్చిన శిక్షకులతో 35 మందికి జావా శిక్షణ అందించి, వారికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించినట్లు వెల్లడించారు.
ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో ప్రభుత్వం కేటాయించిన రెండు ఎకరాల స్థలంలో ఈ హబ్‌ను నిర్మిస్తున్నట్లు ఎంపీ తెలిపారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆలోచనల మేరకు ఐటీఐల పునరుద్ధరణలో భాగంగా ఇక్కడ న్యాక్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
కాకినాడ జిల్లా నుంచి ఏటా సుమారు 20 వేల మంది వివిధ కోర్సులు పూర్తి చేసి బయటకు వస్తున్నారని, వారిలో ప్రతి సంవత్సరం కనీసం 1,000 మందికి నైపుణ్య శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించడం, 100 మందిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం తమ లక్ష్యమని తెలిపారు. సెంటర్‌లో డిజిటల్ లైబ్రరీ, మెంటార్ల సేవలు, ప్రభుత్వ పథకాలను పొందేందుకు ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
‘స్కిల్, స్టార్టప్, భారత్ హబ్’ ప్రభుత్వం, ఎంపీ లేదా ఎమ్మెల్యేల సొంత కార్యక్రమం కాదని, ఇది కాకినాడ ప్రజలందరి కార్యక్రమమని సానా సతీష్ బాబు పేర్కొన్నారు. స్థానిక వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వాములై తమ సలహాలు, సహకారం అందించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబును ఘనంగా సన్మానించారు.