తెలంగాణ
కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలు చేస్తోంది - కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం
28-09-2026 14:26
ఈవీఎంలు, ఈసీపై ఆరోపణలు కాంగ్రెస్ దివాళాకోరుతనమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. రాజ్యాంగ వ్యవస్థలపై రాహుల్ గాంధీ విదేశాల్లో విషప్రచారం చేస్తున్నారని మీడియా సమావేశంలో ఆరోపించారు.
xPress24, Hyderabad, September 28,
భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ ప్రజల మనసులు గెలుచుకునే ప్రజాస్వామ్యబద్ధంగా విజయాలు సాధిస్తుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.ఎన్నికల్లో గెలిచినప్పుడు తమ ఘనతగా చాటుకుంటూ, ఓడిపోయిన వెంటనే ఈవీఎంలు, ఎన్నికల సంఘంపై నిందలు వేయడం కాంగ్రెస్ పార్టీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని ఆయన తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్‌ను గెలిపించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిది కాదని ఎద్దేవా చేశారు.రాజ్యాంగ వ్యవస్థల పట్ల కాంగ్రెస్ వైఖరిని, రాహుల్ గాంధీ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి తప్పుబట్టారు. 1975లో ఎమర్జెన్సీ విధించి పౌర హక్కులను కాలరాసి, ప్రతిపక్ష నేతలను జైళ్లలో నెట్టిన చరిత్ర కలిగిన కాంగ్రెస్‌కు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని అన్నారు.దేశ భద్రతా దళాలు, ఆర్మీ చీఫ్, సర్జికల్ స్ట్రైక్స్, జాతీయ భద్రతా సలహాదారు, భారత ప్రధాన న్యాయమూర్తి, చివరకు పార్లమెంట్ వంటి రాజ్యాంగ వ్యవస్థలన్నింటిపై రాహుల్ గాంధీ విదేశీ గడ్డపై విషప్రచారం చేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.