జాతీయం
కృత్రిమ మేధస్సు నియంత్రణకు కేంద్రం కసరత్తు... త్వరలో మార్గదర్శకాలు
09-10-2026 09:40
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. దీనిపై త్వరలో మార్గదర్శకాలు రూపొందించనున్నట్లు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
xPress24, Delhi, October 8,
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై నియంత్రణకు కేంద్రం నడుం బిగించింది. దీనిపై త్వరలో మార్గదర్శకాలు రూపొందించనున్నట్లు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. కృత్రిమ మేధ భద్రత, డీప్‌ఫేక్‌లు, మానవీయ కోణం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని నెల రోజుల్లో సంప్రదింపుల పత్రం విడుదల చేయనున్నట్లు తెలిపారు. దిల్లీలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ, భారత్‌లోనూ ఏఐ నియంత్రణకు నిబంధనలు తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు. త్వరలోనే సంప్రదింపుల పత్రంతో ముందుకు రావాలని సంబంధిత విభాగానికి సూచించారు. సాంకేతిక రంగంలో వస్తున్న వేగవంతమైన మార్పులకు అనుగుణంగా పటిష్టమైన విధానాలు అవసరమని పేర్కొన్నారు.
డీప్‌ఫేక్‌లపై ఆందోళన
ఈ సందర్భంగా డీప్‌ఫేక్‌ల గురించి కేంద్ర మంత్రి ఆందోళన వ్యక్తంచేశారు. సమాజంలో సమస్యలను సృష్టించే విధంగా ఇవి తయారయ్యాయని, దీన్ని ఒక ఉపద్రవంగా అభివర్ణించారు. డీప్‌ఫేక్‌ల నాణ్యత రోజురోజుకూ మెరుగవుతోందని పేర్కొన్నారు. పౌరులు కూడా వాటిని విశ్వసించడం మొదలుపెడితే తప్పుడు విషయాలు నమ్మడానికి ఆకర్షితులవ్వడంతో పాటు తప్పులు చేసేందుకూ వెనుకాడబోరని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి డీప్‌ఫేక్‌ల వెనుక ఎవరున్నా విడిచిపెట్టేది లేదని, అందుకు అనుగుణంగా కఠిన నిబంధనలను సంబంధిత పత్రంలో పొందుపరచనున్నట్లు స్పష్టం చేశారు.
అందరి సహకారంతోనే సమర్థ నియంత్రణ
కృత్రిమ మేధను గానీ, ఇతర సాంకేతికతలను గానీ కేవలం చట్టాల ద్వారా పూర్తిగా నియంత్రించలేమని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. దీనికోసం పరిశ్రమ, భాగస్వామ్యపక్షాల సహకారం కూడా ఎంతో అవసరమని పేర్కొన్నారు. అందరూ సమన్వయంతో పనిచేస్తేనే సాంకేతిక దుర్వినియోగాన్ని అరికట్టవచ్చని వెల్లడించారు. భవిష్యత్తులో పౌరుల రక్షణకు ప్రాధాన్యతనిస్తూ తగిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.