క్రీడలు
కామన్వెల్త్ గేమ్స్ పవర్లిఫ్టింగ్‌లో స్వర్ణ పతక విజేత కృపారావుకు ఎమ్మెల్యే వసంత అభినందనలు
09-10-2026 14:33
కామన్వెల్త్ గేమ్స్ పవర్లిఫ్టింగ్ పోటీల్లో స్వర్ణ పతకం సాధించి అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని చాటిచెప్పిన ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన సంకు కృపారావును మైలవరం ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాదు అభినందించారు.
xPress24, G. Konduru, October 9,
జి.కొండూరు, అక్టోబర్ 9:
కామన్వెల్త్ గేమ్స్ పవర్లిఫ్టింగ్ పోటీల్లో స్వర్ణ పతకం సాధించి అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని చాటిచెప్పిన ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన సంకు కృపారావును మైలవరం ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాదు అభినందించారు. శుక్రవారం జి.కొండూరులో నిర్వహించిన ప్రజాదర్బార్ (P.G.R.S.) కార్యక్రమంలో ఎమ్మెల్యేను కృపారావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన సాధించిన విజయాన్ని ఎమ్మెల్యే ప్రత్యేకంగా ప్రశంసించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
కెనడాలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ పవర్లిఫ్టింగ్ పోటీల్లో కృపారావు స్వర్ణ పతకం సాధించడం రాష్ట్రానికి గర్వకారణమని వసంత కృష్ణప్రసాదు పేర్కొన్నారు. కఠోర శ్రమ, నిరంతర సాధన, పట్టుదలతో అంతర్జాతీయ స్థాయిలో పతకం సాధించడం అభినందనీయమన్నారు. కృపారావు విజయం రాష్ట్రంలోని యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని, సరైన ప్రోత్సాహం, అవకాశాలు కల్పిస్తే మన క్రీడాకారులు ప్రపంచస్థాయిలో మరిన్ని విజయాలు సాధించగలరని పేర్కొన్నారు.
పి-4 కార్యక్రమం ద్వారా రూ.లక్ష ఆర్థికసాయం
కృపారావులోని క్రీడా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం పి-4 కార్యక్రమం ద్వారా ఆర్థికసాయం అందించిందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ మేరకు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మిశకు లేఖ రాయగా, కృపారావుకు రూ.లక్ష ఆర్థికసాయం అందినట్లు పేర్కొన్నారు. ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించడం, వారి విజయ ప్రస్థానానికి అవసరమైన సహకారం అందించడం ఎంతో ముఖ్యమన్నారు.
కృపారావు సాధించిన విజయాన్ని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులోనూ ఆయనకు మరింత ప్రోత్సాహం అందించే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. క్రీడాకారులు తమ లక్ష్యాలను సాధించే క్రమంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా అవసరమైన సహకారం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధిస్తా: కృపారావు
తన విజయాన్ని గుర్తించి అభినందించిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదుకు సంకు కృపారావు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మరింత కష్టపడి సాధన చేస్తూ రాష్ట్రానికి, దేశానికి మరిన్ని పతకాలు తీసుకురావడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా యువతలో క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుందని, ప్రతిభావంతులైన క్రీడాకారులకు అండగా నిలవడం సమాజ బాధ్యత అని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడ్డారు.