తెలంగాణ
క్రిప్టో కరెన్సీ పేరుతో రూ.10 కోట్ల మోసం.. ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరు ప్రధాన నిందితుల అరెస్ట్
13-10-2026 10:57
క్రిప్టో కరెన్సీ మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరిట తెలుగు రాష్ట్రాల్లో 500 మందిని మోసం చేసి రూ.10 కోట్లు కాజేసిన అంతర్రాష్ట్ర ముఠాలోని ఇద్దరు ప్రధాన నిందితులను ఆదిలాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పెట్టుబడులు రెట్టింపు చేస్తామంటూ జూమ్ మీటింగ్‌ల ద్వారా అమాయకులను బురిడీ కొట్టించారని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. నిందితుల నుంచి వివరాలు సేకరిస్తూ, పరారీలో ఉన్న మరో నలుగురి కోసం గాలింపు చేపట్టారు.
xPress24, Adilabad, October 13,
క్రిప్టో కరెన్సీ మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరుతో భారీ మోసానికి పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను ఆదిలాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. రెండేళ్లలో పెట్టుబడులు రెట్టింపు చేస్తామని నమ్మించి తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 500 మంది బాధితుల నుంచి రూ.10 కోట్లకు పైగా వసూలు చేసినట్లు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మీడియా సమావేశంలో వెల్లడించారు.
కమిషన్ల పేరుతో ఎర.. రూ.10 కోట్ల వసూలు
గత మూడేళ్లుగా కంటెం ఇండియా పేరిట వెబ్‌సైట్ ద్వారా ప్రచారం చేస్తూ ఉద్యోగులు, వ్యాపారులు, రిటైర్డ్ ఉద్యోగులను టార్గెట్ చేశారని ఎస్పీ తెలిపారు. కొత్త సభ్యులను చేర్పిస్తే 25 శాతం, ఆ తర్వాత 5 నుంచి 10 శాతం వరకు కమిషన్ ఇస్తామని ఆశ చూపారు. జూమ్ మీటింగ్‌లు, ప్రముఖ హోటళ్లలో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలను నమ్మించారు. ఇలా వసూలు చేసిన డబ్బులతో నిందితులు భూములు, ప్లాట్లు కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలింది.
బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రధాన సూత్రధారులు కంటెం ఇండియా వ్యవస్థాపకుడు డాక్టర్ రత్నరాజు, సహ వ్యవస్థాపకుడు లాజరస్‌లను అరెస్ట్ చేశారు. మరో నలుగురు నిందితులు గోపికృష్ణ, అజీం ఖాన్, గాజుల ప్రమోద్ కుమార్, వేమునూరు సుధీర్ పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని ఎస్పీ చెప్పారు. ఇలాంటి అనధికార వెబ్‌సైట్లను నమ్మి ఎవరూ మోసపోవద్దని, బాధితులు వెంటనే పోలీసులను లేదా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని సూచించారు.
బైట్
అఖిల్ మహాజన్, ఎస్పీ, ఆదిలాబాద్ జిల్లా