తెలంగాణ
కలవరపెడుతున్న నీటి గణాంకాలు
07-10-2026 11:09

తెలంగాణలో నీటి వనరుల పై కేంద్ర జలశక్తి శాఖ జలవనరుల గణనను విడుదల చేసింది.
xPress24, Hyderabad, October 7,
తెలంగాణలో నీటి వనరుల సంరక్షణ ఆందోళనకరంగా ఉంది. కేంద్ర జలశక్తి శాఖ తాజాగా వెల్లడించిన జలవనరుల గణన (సెకండ్ సెన్సస్ ఆఫ్ వాటర్‌బాడీస్) ప్రకారం.. రాష్ట్రంలో జలవనరులు గణనీయంగా పడిపోయినట్టు తేలింది. 2024-25లో నిర్వహించిన ఈ గణన తాలూకూ నివేదికను తాజాగా విడుదల చేశారు. ఆ నివేదిక ప్రకారం.. 2017-18లో రాష్ట్రంలో 64,056 జలవనరులు ఉండగా, ప్రస్తుత లెక్కల ప్రకారం ఆ సంఖ్య 53,685కి పడిపోయింది. అంటే ఎనిమిదేళ్ల వ్యవధిలో 10,371 జలవనరులు క్షిణించాయి . 16.2 శాతం క్షీణత. అయితే రాష్ట్రంలో చిన్న చెరువులు, కుంటలు, పెర్కొలేషన్ ట్యాంకులు, చెక్ డ్యామ్‌లు గణనీయంగా తగ్గిపోగా.. పెద్ద ట్యాంకులు, జలాశయాల సంఖ్య పెరగడం విశేషం.
…పాజ్..
2017-18లో 16,292గా ఉన్న పెద్ద ట్యాంకుల సంఖ్య, ప్రస్తుతం 17,228కి పెరిగింది. అలాగే.. జలాశయాలు తొలి సర్వే సమయంలో 111 ఉండగా ప్రస్తుతం 134 ఉన్నాయి. సరస్సులు 289 నుంచి 278కి తగ్గాయి. పెర్కొలేషన్ ట్యాంకులు/ చెక్‌డ్యాంలు 19239 నుంచి 11,687కి పడిపోయాయి. ఇతర జలవనరులు తొలి సర్వేలో 1122 ఉండగా రెండో సర్వేలో 176 మాత్రమే ఉన్నాయి. తెలంగాణలో చెరువులకు చారిత్రక నేపథ్యం ఉంది. గ్రామీణ తెలంగాణలో చెరువుల వ్యవస్థ అత్యంత కీలకం. కాకతీయుల కాలం నుంచి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చెరువుల చుట్టూనే అభివృద్ధి చెందింది. అలాంటి చెరువుల సంఖ్య తగ్గిపోవడం ఆందోళన కలిగించే అంశం. 2017-18లో 27,003 చెరువులు ఉండగా తాజా గణాంకాల్లో వాటి సంఖ్య 24,182గా ఉంది. అంటే 2821 చెరువులు తగ్గాయి. సుమారు 10.4 శాతం క్షీణత. ఒక చెరువు రికార్డుల నుంచి కనుమరుగయ్యిందంటే.. దాని చుట్టూ అల్లుకుని ఉన్న ఆర్థిక, సామాజిక ప్రగతిని కూడా దెబ్బతీసే ఆస్కారం ఉంటుంది.