ఆంధ్రప్రదేశ్
కాలువల్లో పూడికతీత పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలి
07-10-2026 17:47
కాలువల్లో నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం లేకుండా పూడికతీత, గుర్రపుడెక్క, చెత్త, వ్యర్థాల తొలగింపు పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు.
xPress24, Amalapuram, October 7,
అమలాపురం:
కాలువల్లో నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం లేకుండా పూడికతీత, గుర్రపుడెక్క, చెత్త, వ్యర్థాల తొలగింపు పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. వర్షాకాలం నేపథ్యంలో కాలువల్లో నీరు నిలిచిపోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
అమలాపురం అర్బన్‌లోని కుమ్మరి కాలువను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కాలువలో నీటి ప్రవాహం, కొనసాగుతున్న పూడికతీత పనులను ఇంజనీరింగ్, మున్సిపల్, రెవెన్యూ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. జేసీబీలతో చేపడుతున్న పూడికతీత, వ్యర్థాల తొలగింపు పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
కాలువలో పేరుకుపోయిన పూడిక, గుర్రపుడెక్క, చెత్తను పూర్తిస్థాయిలో తొలగించి నీటి ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. కాలువ పరిసర ప్రాంతాల్లో పేరుకుపోయిన డంపింగ్ వ్యర్థాలను తొలగించి పారిశుధ్య చర్యలను ముమ్మరం చేయాలని సూచించారు. ప్రజారోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కాలువలు, పరిసర ప్రాంతాలపై నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.