ఆంధ్రప్రదేశ్
గోదావరి డెల్టా ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం
07-10-2026 14:09
గోదావరి డెల్టాలో ఏటా తలెత్తుతున్న ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
xPress24, Vijayawada, October 7,
విజయవాడ, అక్టోబర్ 7:
గోదావరి డెల్టాలో ఏటా తలెత్తుతున్న ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. రూ.13.4 కోట్ల వ్యయంతో నిర్వహించిన లైడార్ సర్వే ఆధారంగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. బుధవారం విజయవాడలోని ఇరిగేషన్ క్యాంపు కార్యాలయంలో గోదావరి డెల్టా ఆధునీకరణపై ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, గోదావరి డెల్టా చీఫ్ ఇంజినీర్, సూపరింటెండింగ్ ఇంజినీర్, ఐఐఎస్‌సీ టెక్నాలజీస్ ప్రతినిధులు పాల్గొన్నారు.
గోదావరి డెల్టా ఆధునీకరణలో భాగంగా ఈస్టర్న్ డెల్టాకు రూ.1,137 కోట్లు, సెంట్రల్ డెల్టాకు రూ.1,268 కోట్లతో ప్రతిపాదనలు ఇప్పటికే సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు. వెస్ట్రన్ డెల్టాకు సంబంధించిన అంచనాలను కూడా త్వరితగతిన సిద్ధం చేసి సమర్పించాలని సంబంధిత ఏజెన్సీ ప్రతినిధులను ఆదేశించారు.
డెల్టా ఆధునీకరణలో కాలువలు, డ్రెయిన్లు, బండ్‌ల స్థాయి, డీసిల్టింగ్, లాకులు, షట్టర్లు తదితర అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి సూచించారు. పూడిక పేరుకుపోయి నీటి ప్రవాహానికి ఆటంకంగా మారిన సీ మౌత్‌ల వద్ద డ్రెడ్జింగ్ పనులకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
గోదావరి దిగువ ప్రాంతాల్లోని ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు, నరసాపురం, భీమవరం తదితర ప్రాంతాల్లో సముద్రంలో కలిసే డ్రెయిన్లలో పేరుకుపోయిన పూడికను తొలగించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.
బ్రిటిష్ కాలంలో నిర్మించిన పాత లాకులు, అవుట్‌ఫాల్ స్లూయిజ్‌లు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో వాటికి మరమ్మతులు చేపట్టడం లేదా అవసరమైన చోట కొత్త నిర్మాణాలు చేపట్టడంపై సమగ్రంగా పరిశీలించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
లైడార్ సర్వే నిర్వహించిన ఐఐఎస్‌సీ టెక్నాలజీస్ ప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు ప్రతిపాదనలు, డీపీఆర్‌లు సిద్ధం చేసే సమయంలో స్థానిక సాగునీటి సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధుల అనుభవాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి సూచించారు. స్థానికంగా ఉన్న సమస్యలు, నీటి ప్రవాహ మార్గాలు, ముంపు ప్రాంతాలు, డ్రెయిన్ల పరిస్థితిపై సాగునీటి సంఘాలు, ప్రజాప్రతినిధులకు ఉన్న అనుభవాన్ని సాంకేతిక సమాచారంతో సమన్వయం చేసి సమగ్ర డీపీఆర్‌లు రూపొందించాలని తెలిపారు.
డీపీఆర్‌లు పూర్తయిన అనంతరం వాటిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి, అవసరమైన నిధులు మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. గోదావరి డెల్టా ఆధునీకరణ ద్వారా ముంపు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు సాగునీటి పారుదల వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.