ఆంధ్రప్రదేశ్
గిరిజన ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
08-10-2026 17:11
గిరిజన ప్రాంతాల సర్వతోముఖ అభివృద్ధి, గిరిజనుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు.
xPress24, Paravathipuram, October 8,
పార్వతీపురం మన్యం జిల్లా, అక్టోబర్ 8:
గిరిజన ప్రాంతాల సర్వతోముఖ అభివృద్ధి, గిరిజనుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో పార్వతీపురం మన్యం జిల్లాను ప్రగతిపథంలో నడిపిస్తామని ఆమె స్పష్టం చేశారు.
గురువారం పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన
75వ ఐటీడీఏ పాలకవర్గ సమావేశం
అనంతరం మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కురుపాం, సాలూరు, పార్వతీపురం నియోజకవర్గాల పరిధిలో వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనులపై సమావేశంలో సమీక్షించినట్లు తెలిపారు.
గిరిజన ప్రాంతాల్లో 147 రహదారులకు సంబంధించి మొదటి, రెండో లేయర్ పనులు పూర్తయ్యాయని, మూడో లేయర్ పనులను వేగవంతం చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచామని చెప్పారు.
పల్లె పండుగ 3.0, జల్ జీవన్ మిషన్
ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ తాగునీటి సౌకర్యం కల్పించడంతో పాటు సీసీ రోడ్లు, డ్రైనేజీ వసతులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఉపాధి హామీ పథకం (వీబీ జీ రామ్ జీ పథకం) కింద అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రామ సచివాలయాలు, హెల్త్ క్లినిక్ భవనాలను ప్రాధాన్యతా క్రమంలో నిర్మిస్తామని పేర్కొన్నారు.
విద్యారంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు
తల్లికి వందనం
పథకం, హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీల పెంపు వంటి చర్యలతో విద్యార్థుల డ్రాప్‌అవుట్లు తగ్గాయని మంత్రి తెలిపారు. జిల్లాలో సుమారు 1.15 లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తుండగా, గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో సుమారు 30 వేల మంది విద్యార్థులు విద్యను పొందుతున్నారని వెల్లడించారు.
గిరిజనులకు త్వరలో
ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు
పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఇందుకోసం రెవెన్యూ, అటవీ శాఖలు సంయుక్తంగా సర్వే నిర్వహిస్తున్నాయని చెప్పారు. 2004కు ముందు నుంచి నివాసముంటున్న అర్హులకు ఇళ్ల స్థలాలు కల్పించేందుకు రెవెన్యూ, అటవీ, ఆర్‌అండ్‌బీ, మున్సిపల్ శాఖలు సమన్వయంతో సర్వే చేపడుతున్నాయని వివరించారు.
గిరిజన సహకార సంస్థ ద్వారా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల కొండ ప్రాంతాల్లో గిరిజనులు పండించిన జీడిపప్పు, ఎండుమిర్చి, చింతపండు, పసుపు తదితర ఉత్పత్తులను తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా చేసేందుకు
ఎంఓయూ కుదరడం ఐటీడీఏ చరిత్రలో ముఖ్యమైన అంశమని
మంత్రి పేర్కొన్నారు. అయితే ఇటీవల కురిసిన వర్షాల కారణంగా సరుకులో తేమ శాతం పెరగడంతో నాణ్యతా ప్రమాణాల దృష్ట్యా కొంత సరుకును వెనక్కి పంపారని, అంతమాత్రాన ఒప్పందం రద్దు కాలేదని స్పష్టం చేశారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాల సమయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, విలేకరులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారని మంత్రి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాను అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ముందువరుసలో నిలిపేందుకు అందరి సహకారంతో కృషి చేస్తామని ఆమె స్పష్టం చేశారు.