తెలంగాణ
గ్రామీణ ఉపాధి పనుల అమలును పటిష్టం చేయాలి: మంత్రి సీతక్క
01-10-2026 10:17
గ్రామీణ ప్రాంతాల్లో అర్హులైన ప్రతి కుటుంబానికి ఉపాధి అవకాశాలు అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. వీబీ జీ రామ్ జీ అమలుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆమె, క్షేత్రస్థాయి పరిస్థితులు, పనుల పురోగతిపై సమీక్ష జరిపారు.
xPress24, Delhi, September 30,
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం అమలు తీరుపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వీబీ జీ రామ్ జీ అమలుపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రామాల్లో పనుల గుర్తింపు, ఉపాధి కల్పన, పురోగతిపై చర్చించారు. సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్ల నుంచి క్షేత్రస్థాయి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ పంచాయతీల పాత్ర, బాధ్యతలపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఉపాధి అందేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
గ్రామసభల నిర్ణయాలకు పెద్దపీట
ఉపాధి హామీ పనుల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో గ్రామసభల నిర్ణయాలకే పూర్తి ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి సీతక్క సూచించారు. పనుల నిర్వహణలో పారదర్శకత, నాణ్యత, జవాబుదారీతనం పాటించాలని కోరారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా మండల, జిల్లా స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
గ్రామాల అభివృద్ధి, ఉపాధి కల్పనే లక్ష్యం
గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించడంతో పాటు గ్రామాల అభివృద్ధిని వేగవంతం చేయాలని మంత్రి పేర్కొన్నారు. వీబీ జీ రామ్ జీ అమలును మరింత పటిష్ఠం చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన ఫలితాలు అందేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.