ఆంధ్రప్రదేశ్
ఘనంగా ప్రపంచ వృద్ధుల దినోత్సవ వేడుకలు
01-10-2026 17:35
కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ఈడేపల్లి ప్రభుత్వ వృద్ధాశ్రమంలో ప్రపంచ వృద్ధుల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
xPress24, Machilipatnam, October 1,
మచిలీపట్నం, అక్టోబర్ 1:
కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ఈడేపల్లి ప్రభుత్వ వృద్ధాశ్రమంలో ప్రపంచ వృద్ధుల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ టి. లీలా ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. వృద్ధులు దేశానికి అమూల్యమైన సంపద అని పేర్కొన్నారు. వారి ఆరోగ్యం, ఆత్మగౌరవం, సంక్షేమాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వృద్ధులను గౌరవించడం, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని తెలిపారు.
కార్యక్రమంలో భాగంగా వృద్ధులతో కేక్ కట్ చేయించి, పండ్లు, మిఠాయిలు పంపిణీ చేశారు. అలాగే, రూ.3 లక్షల విలువైన నిత్యావసర వస్తువులను వృద్ధాశ్రమానికి అందజేశారు. వృద్ధుల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో వైద్యులు వృద్ధులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సూచనలు అందించారు.
ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, వైద్యులు, వెలుగు ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.