ఆంధ్రప్రదేశ్
చేనేత, హస్తకళల ప్రోత్సాహానికి క్రాఫ్ట్స్ కౌన్సిల్ కృషి అభినందనీయం
01-10-2026 18:05
రాష్ట్ర చేనేత, హస్తకళల వైభవాన్ని చాటడంతోపాటు నేత కార్మికులు, హస్తకళాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (సీసీఏపీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు.
xPress24, Vijayawada, October 1,
విజయవాడ:
రాష్ట్ర చేనేత, హస్తకళల వైభవాన్ని చాటడంతోపాటు నేత కార్మికులు, హస్తకళాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (సీసీఏపీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు.
విజయవాడలోని పీవీపీ స్క్వేర్ మాల్‌లో సీసీఏపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేనేత బజారును గురువారం ఆయన తన సతీమణితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీసీఏపీ కార్యదర్శి ఎస్. రంజన, వైస్ చైర్‌పర్సన్ బి. సుజాత తదితరులు పాల్గొన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 1 నుంచి 4వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు ఈ బజారును నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. చేనేత, హస్తకళలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని పేర్కొన్నారు. ముఖ్యంగా యువతలో చేనేత వస్త్రాలు, హస్తకళలపై అవగాహన పెంపొందించడంతోపాటు సంప్రదాయ కళలను భావితరాలకు అందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు.
చేనేత వస్త్రాలు, చేతివృత్తుల సుస్థిర అభివృద్ధి కోసం క్రాఫ్ట్స్ కౌన్సిల్ లాభాపేక్ష లేకుండా కృషి చేస్తోందని ప్రశంసించారు. నేత కార్మికులు, హస్తకళాకారుల సంక్షేమం, డిజైన్ల అభివృద్ధి, శిక్షణ, మార్కెటింగ్ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తూ వారి అభివృద్ధికి తోడ్పడుతోందని వివరించారు.
వెంకటగిరి, పొందూరు, పెడన తదితర ప్రాంతాలకు చెందిన ప్రత్యేక చేనేత వస్త్రాలతోపాటు సంప్రదాయ కళాకృతులను వివిధ కార్యక్రమాల ద్వారా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. చేనేత, హస్తకళల పరిరక్షణ, అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నాయని పేర్కొన్నారు. త్వరలో విజయవాడలో జాతీయ సరస్ అజీవిక మేళా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కొండపల్లి, ఏటికొప్పాక వంటి ప్రాంతాలకు చెందిన అపురూపమైన కళాసంపదను పరిరక్షించేందుకు కూడా విశేష కృషి జరుగుతోందని తెలిపారు.
ప్రజలు చేనేత బజారును సందర్శించి చేనేత వస్త్రాలు, హస్తకళా ఉత్పత్తులను కొనుగోలు చేయాలని కలెక్టర్ కోరారు. తద్వారా నేత కార్మికులు, హస్తకళాకారులకు ఆర్థికంగా చేయూతనివ్వడంతోపాటు మన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.