ఆంధ్రప్రదేశ్
జేఎన్‌టీయూజీవీ–శ్రీయాన్ సంస్థ మధ్య కీలక ఎంవోయూ
07-10-2026 17:47
విజయనగరంలోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ–గురజాడ (జేఎన్‌టీయూజీవీ), విశాఖపట్నానికి చెందిన శ్రీయాన్ ఇంటర్నేషనల్ బిజినెస్ అడ్వైజరీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో కీలక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది.
xPress24, Vizianagaram, October 7,
విజయనగరం:
విజయనగరంలోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ–గురజాడ (జేఎన్‌టీయూజీవీ), విశాఖపట్నానికి చెందిన శ్రీయాన్ ఇంటర్నేషనల్ బిజినెస్ అడ్వైజరీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో కీలక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది.
పునరుత్పాదక ఇంధనం, సుస్థిరత, ఇంధన పొదుపు, కృత్రిమ మేధ (ఏఐ), రోబోటిక్స్, ఈఎస్‌జీ, కార్బన్ మేనేజ్‌మెంట్ తదితర ఆధునిక రంగాల్లో విద్యార్థులకు పరిశ్రమ ఆధారిత నైపుణ్య శిక్షణ, ప్రాజెక్టు ఆధారిత అభ్యాసం, పరిశోధన, ఇంటర్న్‌షిప్‌లను అందించడం ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశంగా పేర్కొన్నారు.
ఈ భాగస్వామ్యంలో భాగంగా విద్యార్థులకు వాస్తవ పరిశ్రమ సమస్యలపై ప్రాజెక్టులు చేపట్టే అవకాశం కల్పించడంతో పాటు ప్రాక్టికల్ శిక్షణ, నిపుణుల మార్గదర్శకత్వం, ఇంటర్న్‌షిప్‌లు అందించనున్నారు. ముఖ్యంగా బీటెక్ చివరి సంవత్సరం, ఎంటెక్, పీహెచ్‌డీ విద్యార్థుల ప్రాజెక్టులకు పరిశ్రమ నిపుణులు మార్గదర్శకత్వం అందిస్తారు.
విద్యార్థులు రూపొందించే వినూత్న ఆలోచనలను ప్రోటోటైప్ దశ నుంచి వ్యాపార నమూనా రూపకల్పన, వాణిజ్యీకరణ దిశగా తీసుకెళ్లేందుకు సంస్థ సహకారం అందించనుంది. ఈ ఎంవోయూ ద్వారా విద్యార్థులకు పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలు పెంపొందించడంతో పాటు సాంకేతికత, పరిశోధన, ఆవిష్కరణ రంగాల్లో మరిన్ని అవకాశాలు లభించనున్నాయి.