జాతీయం
జాతీయ ఉక్కు విధానం-విజన్ 2047 ముసాయిదాను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
13-10-2026 10:58
భారత ఉక్కు రంగాన్ని పటిష్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ స్టీల్ పాలసీ-విజన్ 2047’ ముసాయిదాను సిద్ధం చేసింది. 2047 నాటికి ముడి ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని 604 మిలియన్ టన్నులకు, ఎగుమతులను 45 మిలియన్ టన్నులకు పెంచడంతో పాటు తలసరి వినియోగాన్ని 302 కిలోలకు చేర్చాలని లక్ష్యంగా నిర్దేశించింది. అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించి క్లీనర్ స్టీల్ తయారీని ప్రోత్సహించనుంది.
xPress24, Delhi, October 13,
దేశంలో ఉక్కు రంగాన్ని అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా, అత్యాధునిక సాంకేతికతతో, పర్యావరణహితంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ‘జాతీయ ఉక్కు విధానం-విజన్ 2047’ ముసాయిదాను రూపొందించింది. దేశీయంగా పెరుగుతున్న ఉక్కు అవసరాలను తీర్చడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ దీర్ఘకాలిక విధానాన్ని తీసుకొచ్చారు.
ఉత్పత్తి మూడు రెట్లు పెంపు.. తలసరి వినియోగంలో భారీ వృద్ధి
ముసాయిదా విధానం ప్రకారం 2047 నాటికి దేశంలో ముడి ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని మూడు రెట్లు పెంచి 604 మిలియన్ టన్నులకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఫినిష్డ్ స్టీల్ డిమాండ్ 505 మిలియన్ టన్నులకు చేరుతుందని అంచనా వేయగా, దేశ ఉక్కు ఎగుమతులను 45 మిలియన్ టన్నులకు పెంచాలని నిర్ణయించారు. భారతదేశంలో తలసరి ఉక్కు వినియోగం ప్రస్తుతం ఉన్న 116 కిలోల నుంచి 2047 నాటికి 302 కిలోలకు పెరుగుతుందని నివేదిక వెల్లడించింది. దేశ ముడి ఉక్కు ఉత్పత్తి 2014-15లో 89 మిలియన్ టన్నులు ఉండగా, 2025-26 నాటికి 170 మిలియన్ టన్నులకు పెరిగింది.
గ్రీన్ స్టీల్, కర్బన ఉద్గారాల తగ్గింపుపై ప్రత్యేక దృష్టి
మౌలిక సదుపాయాలు, గృహ నిర్మాణం, రవాణా, పునరుత్పాదక ఇంధనం, నూతన తయారీ రంగాల్లో ఉక్కు వినియోగాన్ని మరింత పెంచడంపై ఈ పాలసీ దృష్టి పెట్టింది. అదే సమయంలో పర్యావరణ పరిరక్షణ కోసం క్లీనర్ స్టీల్ ఉత్పత్తికి ప్రాధాన్యతనిచ్చింది. విద్యుత్ సామర్థ్యం పెంపు, పునరుత్పాదక ఇంధన వినియోగం, స్క్రాప్ వాడకం, హైడ్రోజన్ ఆధారిత ఉక్కు తయారీ ద్వారా సగటు కర్బన ఉద్గారాల తీవ్రతను ప్రతి టన్ను ముడి ఉక్కుకు 2.54 టన్నుల నుంచి 1.54 టన్నులకు తగ్గించాలని లక్ష్యంగా నిర్దేశించింది.