ఆంధ్రప్రదేశ్
జాతీయ రహదారి-167ఏ రెండో దశ విస్తరణ పనులకు భూమిపూజ
25-09-2026 17:57
పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కేసానుపల్లి వద్ద జాతీయ రహదారి-167ఏ రెండో దశ నాలుగు వరుసల విస్తరణ పనులకు రాష్ట్ర విద్యుత్ శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ శుక్రవారం భూమిపూజ చేశారు.
xPress24, Narasaravpeta, September 25,
పల్నాడు జిల్లా, సెప్టెంబర్ 25:
పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కేసానుపల్లి వద్ద జాతీయ రహదారి-167ఏ రెండో దశ నాలుగు వరుసల విస్తరణ పనులకు రాష్ట్ర విద్యుత్ శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ శుక్రవారం భూమిపూజ చేశారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు డాక్టర్ చదలవాడ అరవిందబాబు, ప్రత్తిపాటి పుల్లారావు, జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల, జాయింట్ కలెక్టర్ సంజన శ్రీహర్ష, జాతీయ రహదారుల శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ.. రూ.387 కోట్లతో భూసేకరణ చేపట్టి, రెండేళ్లలో జాతీయ రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. భూసేకరణకు సంబంధించి రైతులకు ఏవైనా సమస్యలు ఉంటే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. హైవే నిర్మాణం పూర్తయితే నరసరావుపేటలో ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని, పరిసర ప్రాంతాల అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు.
ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. నకరికల్లు–చిలకలూరిపేట రహదారి హైదరాబాద్ నుంచి చీరాల వరకు కనెక్టివిటీ కల్పిస్తూ నాలుగు జిల్లాలను అనుసంధానిస్తుందని తెలిపారు. ఇప్పటికే చిలకలూరిపేట–బాపట్ల రహదారి మొదటి దశ పనులు పూర్తయ్యాయని చెప్పారు. భూసేకరణకు సంబంధించి రూ.240 కోట్లలో రూ.120 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. మిగిలిన మొత్తాన్ని అవార్డులు స్వీకరించిన అనంతరం రైతుల ఖాతాల్లో జమ చేస్తామని పేర్కొన్నారు.
హైవే నిర్మాణంతో ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు రైతులు తమ పంటలను గుంటూరు తదితర ప్రాంతాలకు సులభంగా తరలించేందుకు అవకాశం కలుగుతుందని ఎంపీ తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో బాలకృష్ణతో పాటు ఆర్‌అండ్‌బీ, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.