జాతీయం
జనాభా గణన ప్రక్రియ దేశ భవిష్యత్తుకు ఎంతో ముఖ్యమైనది: ప్రధానమంత్రి నరేంద్రమోదీ
28-09-2026 10:28
దేశ భవిష్యత్తుకు జనాభా లెక్కలు ఎంతో ముఖ్యమని, ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సమాచారాన్ని నమోదు చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దుర్బేధ్యమైన, మంచు ప్రాంతాలలో కూడా జనాభా గణన జరుగుతోందన్నారు.
xPress24, Delhi, September 27,
దేశంలోని అన్ని రాష్ట్రాలలో, కేంద్రపాలిత ప్రాంతాలలోనూ జనాభా లెక్కల మొదటి దశ దాదాపు పూర్తయ్యిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రసంగించిన ప్రధానమంత్రి లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్ లోని దుర్బేధ్యమైన, మంచు ప్రాంతాలలో కూడా ఈ పని జరుగుతోందన్నారు. అక్కడి నుండి ఎన్నో ప్రేరణాత్మకమైన అనుభవాలు మన ముందుకు వచ్చాయని తెలిపారు. ఉత్తరాఖండ్ లో జనాభా లెక్కల గణన చమోలీ లోని మాణా అనే గ్రామం నుంచి మొదలయ్యిందని.. మాణా ను దేశంలోని మొదటి గ్రామమని అంటారని తెలిపారు. మాణాలో అందరికంటే ముందుగా 83 ఏళ్ళ పూర్ణిమా రావత్ గారెతో జనాభా గణన మొదలయ్యిందని చెప్పారు. ఉత్తరకాశీ లోని బగోరీ గ్రామం లో హోం స్టే నడుపుతున్న హరదేవ్ సింగ్ రాణా డిజిటల్ మాధ్యమం ద్వారా తన సమాచారాన్ని స్వయంగా నమోదు చేశారని తెలిపారు.
జనాభా లెక్కలు మనందరి జాతీయ బాధ్యత అనీ.. ఇందుకు అందరూ సమయాన్నివ్వాలంటూ తాను దేశ ప్రజలందరినీ ఆగస్టు 15న కూడా కోరినట్లు చెప్పారు. జనాభా లెక్కల కోసం మన సమాచారాన్ని స్వయంగా మనమే నమోదు చెయ్యడం అనే సౌకర్యం చాలా సులువైనదని ప్రధానమంత్రి అన్నారు. నేరుగా మీ మొబైల్ నుంచే మీరు మీ సమాచారమూ, మీ కుటుంబ సమాచారం కూడా నమోదు చేయవచ్చునని, ఈ సౌకర్యం హిందీతో పాటూ మరో పదహారు భాషల్లో అందుబాటులో ఉందని ప్రధాని అన్నారు. ఇందుకోసం జనాభా లెక్కల ఆన్లైన్ పోర్టల్ se.census.gov.in లో మొబైల్ నంబర్ లాగిన్ అయి కుటుంబ సమాచారాన్ని నమోదు చేయవచ్చునని చెప్పారు. ఇందుకోసం ఏ డాక్యుమెంట్‌ని అప్లోడ్ చేయక్కర్లేదని.. సమాచారాన్ని అప్లోడ్ చేసిన తరువాత ఒక ఐడి నెంబర్ వస్తుందన్నారు. తద్వారా మీరు ఇచ్చిన సమాచారం జనాభా లెక్కల్లో భాగంగా మారిపోతుందని ప్రధాని సూచించారు. ఇప్పటివరకు మొబైల్ ద్వారా, రెండుకోట్ల అరవై లక్షలకు మందికి పైగా ప్రజలు జనాభా లెక్కల పోర్టల్ పై తమ సమాచారాన్ని నమోదు చేశారన్నారు. దేశానికి ఇది ఎంతో ముఖ్యమైనదని తెలిపిన ప్రధాని .. మీరిచ్చే మీ సరైన సమాచారం దేశ భవిష్యత్తు తాలుకు సరైన చిత్రాన్ని తయారుచేసేందుకు సహాయపడుతుందని చెప్పారు.