ఆంధ్రప్రదేశ్
జనాభా గణన–2027పై రాష్ట్రస్థాయి సమావేశం
09-10-2026 14:51
జనాభా గణన–2027 నిర్వహణపై అమరావతిలోని సచివాలయంలో రాష్ట్రస్థాయి ప్రధాన జనగణన అధికారుల సమావేశం కొనసాగుతోంది.
xPress24, Amaravati, October 9,
అమరావతి:
రాష్ట్ర సచివాలయంలో జనగణన–2027 నిర్వహణకు సంబంధించి రాష్ట్ర స్థాయి ప్రధాన జనగణన అధికారుల సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో జనగణన నిర్వహణకు అవసరమైన సమగ్ర కార్యాచరణ వ్యూహం, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, వివిధ శాఖల సమన్వయం తదితర అంశాలపై అధికారులు చర్చిస్తున్నారు.
జనగణన కార్యకలాపాల సంచాలకులు జె. నివాస్ స్వాగత ఉపన్యాసం చేయగా, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శంషేర్ సింగ్ రావత్ ప్రారంభోపన్యాసం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ జనగణన–2027 నిర్వహణపై కీలకోపన్యాసం చేయనున్నారు.
భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ జనగణన ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాలను వివరించనున్నారు. జనగణన రెండో దశలో డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై ప్రత్యేక సాంకేతిక సమావేశాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మొబైల్ యాప్, ఎస్‌ఈ పోర్టల్, సెన్సస్ మేనేజ్‌మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ (CMMS), ఎన్యుమరేషన్ బ్లాక్‌ల (EB) రూపకల్పన పోర్టల్‌పై అధికారులకు అవగాహన కల్పించనున్నారు. జనగణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన సాంకేతిక సాధనాలు, కార్యాచరణ ప్రణాళికలను కూడా సమీక్షించనున్నారు.
ఇదిలా ఉండగా, ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో వ్యవసాయ రంగంపై దాని ప్రభావం, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా నిర్వహణపై సమీక్ష జరగనుంది. సంజీవని కార్యక్రమం అమలుకు సంబంధించిన సన్నద్ధత, కాలానుగుణ వ్యాధుల నియంత్రణ చర్యలపైనా సమావేశంలో చర్చించనున్నారు.
గృహ నిర్మాణ కార్యక్రమాల పురోగతితో పాటు భూ పునఃసర్వే (రీసర్వే) ప్రక్రియపై కూడా అధికారులు సమీక్ష నిర్వహించనున్నారు. వివిధ శాఖల మధ్య సమన్వయంతో ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాల అమలు, వాటి పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.